కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయంపై ఎన్డీయే మండిపడింది. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల, రాజ్యాంగ విలువల పట్ల మీకే మాత్రం గౌరవం లేదనడాన్ని ఇది సూచిస్తోందని బీజేపీ నేతృత్వంలోని 14 పార్టీల నేతలు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఈ నెల 28 న జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వారు కోరారు. ప్రతిపక్షాలవారు మొండిగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని, గత తొమ్మిదేళ్లుగా తరచూ వారు పార్లమెంటరీ ప్రొసీజర్లను ఏ మాత్రం ఖాతరు చేయలేదని, పార్లమెంట్ సమావేశాలను బాయ్ కాట్ చేస్తూ, వాకౌట్లువంటి వాటితో తమ నిర్వాకాన్ని బయటపెట్టుకుంటూ వస్తున్నారని ఎన్డీయే తప్పు పట్టింది.
ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకోవడం ద్వారా కూడా ప్రజాస్వామ్య విలువలను మేం పట్టించుకోబోమని నిరూపించుకుంటున్నారని పేర్కొంది. వీరి హిపోక్రసీకి అంతు అంటూ లేకపోతోందని, లోగడ ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసినప్పుడు కూడా విపక్షాలు ఇలాగే వ్యవహరించాయని ఇది ఆమె పట్ల చూపిన అగౌరవం కాదా అని పాలక ఎన్డీయే పార్టీలు ప్రశ్నించాయి.
ఈ సంయుక్త ప్రకటనపై బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, శివసేన నేత, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనతా పార్టీ నేత దుశ్యంత్ చౌతాలా, కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే తదితరులు సంతకాలు చేశారు.
ప్రధాని మోడీ ఈ నెల 28 న ప్రారంభించనున్న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి మీరు హాజరు కాగలరని ఆశిస్తున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం ద్వారా మీరే ఆమెను, ఆపదవిని అవమానపరుస్తున్నారని 19 విపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. ఇప్పటికైనా సర్కార్ పునరాలోచన చేయగలదని భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. మే 28 న మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.