హ్యాకర్ల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. వరుసగా ప్రభుత్వ శాఖలు, పెద్దల ఖాతాలనే హ్యాకర్లు టార్గెట్ చేస్తూ సవాల్ విసురుతున్నారు. తాజాగా ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. దీంతో ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు దాన్ని మళ్లీ పునరుద్ధరించారు. కొన్ని గుర్తు తెలియని మెసెజ్ లు పోస్ట్ చేశారని.. అయితే.. అవి కాలేదని అధికారులు తెలిపారు. త్వరగానే మళ్లీ పునరుద్ధరించామని అన్నారు.
కాగా.. వరుసగా ప్రభుత్వ ఖాతాలు హ్యాకింగ్ కి గురి కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వారం రోజుల క్రితం కేంద్ర సమాచార, ప్రచార శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అయింది. హ్యాక్ చేసి 50కిపైగా ట్వీట్లు చేశారు. హరీ అప్(Hurry Up) , అమేజింగ్ (Amazing) అని మెసెజ్ లు చేస్తూ.. వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫొటోలు పెట్టారు. వరుస ట్వీట్లు చూసి అధికారులు అయోమయానికి గురైన అధికారులు.. అప్రమత్తమై వెంటనే ఖాతాను పునరుద్ధరించారు.
గత డిసెంబర్ 12న ప్రదాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను కూడా హ్యాక్ చేశారు. అప్పుడు బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ హ్యాకర్స్ మోడీ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. 500బిట్ కాయిన్లను పౌరులకు పంచుతున్నామని పేర్కొన్నారు. వెంటనే అలెర్ట్ అయిన అధికారులు మోడీ ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు.