ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ జిల్లాలో ఓ ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా సుమారు 400 నాణేలు లభించాయి. ఇక్కడి హుస్సైన్ పూర్ గ్రామంలో ఈ నెల 21 న కూలీలు జరుపుతున్న తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. వీటిని చూడగానే వారంతా వీటికోసం ఎగబడ్డారు.
అయితే ఈ సమాచారం ఊరంతా వ్యాపించగానే పురావస్తు శాఖ సిబ్బంది, పోలీసులు అక్కడికి వచ్చి వాలారు. ఈ నాణేలను పరిశీలిస్తే ఇవి మొఘలుల కాలం నాటివిగా తేలింది. వీటిపై అరబిక్ భాషలో రాసి ఉన్న శాసనాల వంటివి కనబడ్డాయని ఎస్పీ సాగర్ జైన్ తెలిపారు
. కానీ ఈ కాయిన్స్ ని ఏ లోహంతో చేశారన్న దానిపై పురావస్తు శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ఇంకా ‘గుప్త నిధులు’ బయటపడతాయేమోనని తవ్వకాలు కొనసాగిస్తున్నారు. కాగా … తాజాగా బయటపడిన నాణేలను ఏదైనా కుండవంటి పాత్రలో కనుగొన్నారా లేక సంచిలోనా అన్నది తెలియలేదు.
ఈ సందర్భంగా లోగడ యూపీలోనే జలౌన్ జిల్లాలో ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు పాత నాణేలు, వెండి నగలు కనిపించిన విషయాన్ని జైన్ గుర్తు చేశారు.