చైనాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా కాటుకు కేవలం 30 రోజుల్లోనే 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జీరో కొవిడ్ పాలసీని గతేడాది డిసెంబర్ 8న ప్రభుత్వం ఎత్తి వేసింది. అప్పటి నుంచి డ్రాగన్ కంట్రీలో కరోనా విలయ తాండవం చేస్తోంది.
డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య కరోనా లక్షణాలతో 59,938 మృతి చెందినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. వారిలో 5,503 మంది శ్వాస సంబంధిత సమస్యలతో మరణించినట్టు పేర్కొంది. 54,435 మంది ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మరణించిన వారి సగటు వయస్సు 80 ఏండ్లుగా ఉందని పేర్కొంది. మృతుల్లో అత్యధికంగా 90 శాతం మంది 65 ఏండ్లకు పైబడినవారే ఉన్నట్టు వెల్లడించింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అయితే భయపడాల్సిన పని లేదని క్రమంగా ఈ సంఖ్య తగ్గుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ నాటికే 76 శాతం మంది వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.
ఈ నెల చివర వరకు ఆ సంఖ్య 92 శాతానికి చేరుతుందని తెలుస్తోంది. ఇక ఈ నెల 22 నుంచి చైనాలో న్యూ ఇయర్, స్ప్రింగ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రాబోయే 2, 3 నెలల్లో కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంటున్నారు.
జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మంది కరోనా బారినపడినట్టు పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. ప్రస్తుత చైనా జనాభా 141 కోట్లలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్ లో 91 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది.