జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గృహ హింస పర్వాలేదని మహిళలు, పురుషుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమైనట్టు నివేదిక తెలిపింది. భార్యలు తమ విధులు సరిగ్గా నిర్వహించకపోతే వారిపై భౌతిక దాడి( గృహ హింస)చేసినా పర్వాలేదని దేశంలోని సగం మంది పురుషులు, మహిళలు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా 45 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు ఈ ఆలోచనలు వెల్లడించినట్టు సర్వే పేర్కొంది. ఈ వాదనను సమర్థించే వారి సంఖ్య కర్ణాటకలో అత్యధికంగా ఉన్నట్టు తెలిపింది. కర్ణాటకలో 76.9 శాతం మహిళలు, 81.9 శాతం పురుషులు ఈ వాదన సరైనదిగా నమ్ముతున్నట్టు వెల్లడించారని సర్వే పేర్కొంది.
భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడము, సరిగ్గా వంట చేయకపోవడం, భర్తకు విధేయురాలిగా ఉండకపోవడం వంటి కారణాలపై భార్యను కొట్టడంలో తప్పు లేదని ఎక్కువ మంది అంగీకరించినట్టుగా సర్వే తెలిపింది. భర్తతో శృంగారానికి అంగీకరించనప్పుడు భార్యపై దాడి చేయడంలో తప్పేమి లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.
సర్వేలో 11శాతం మహిళలు, 9.7 శాతం పురుషులు ఈ మేరకు అభిప్రాయాలు తెలిపారని నివేదిక చెప్పింది. అత్తా, మామలు, ఆడబిడ్డలను గౌరవించకపోవడం గృహ హింసకు ప్రధాన కారణం అని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు పేర్కొన్నట్టు నివేదిక పేర్కొంది. ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం కూడా కారణమని 28 శాతం మహిళలు, 22 శాతం పురుషులు పేర్కొన్నట్టు సర్వే వివరించింది.