పంటకు, పంటకు మధ్య సంధికాలంలో పొలాల్ని శుభ్రం చేస్తుంటారు రైతులు. ఎందుకంటే పంట చేనుతో పాటూ చీడపీడలు కూడా గట్టున పెరుగుతూ ఉంటాయి. మరో పంట వెయ్యాలంటే విధిగా శుభ్రచెయ్యాలి.
చీడను తొలగించడానికి ఓ రైతు చేసిన ప్రయత్నం మరి కొంత మంది రైతులకు కీడు చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజపేట మండలంలో ఈ ఘటన జరిగింది.
చెరువు గట్టుపైనున్న కంపలు తగలబెట్టేందుకు పూనుకున్నాడు ఓ రైతు. అనుకున్నదే తడవుగా కిరోసిన్ కొద్దిగా వేసి.. నిప్పు పెట్టేశాడు. మంట పెట్టిన ఆ రైతు..పరధ్యానంగా ఉన్నాడు.
దీంతో దగ్గర్లోని పొలాల్లోకి మంట విస్తరించాయి. అక్కడి ధాన్యం బస్తాలు మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అనుకోని రీతిలో నగదు కూడా అగ్నికి ఆహుతి అయ్యింది.
బాధితుల వివరాల మేరకు..తుమరాడ గ్రామంలోని కృష్ణసాగరం ఒడ్డున…చెరువు గట్టుపైనున్న తుప్పలు కాల్చేందుకు ఓ రైతు నిప్పు పెట్టాడు. ఆపై జాగ్రత్త లేకుండా తన పనులు తాను చూసుకున్నాడు.
మధ్యాహ్నానికి మంటలు పక్కనున్న పొలాల్లోకి దావానలంలా వ్యాపించాయి. ప్రమాదంలో మిర్తివలస గ్రామానికి చెందిన 17 మంది రైతుల ధాన్యం బస్తాలు కాలి బూడిదయ్యాయి. సుమారు 8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.
అయితే చిరు వ్యాపారి అయిన గండబోను సింహాచలం తుమరాడకు చెందిన రైతుల వద్ద 100 బస్తాల వడ్లు కొని పొలాల్లోనే ఉంచాడు. వారికి డబ్బు చెల్లించేందుకు శుక్రవారం బలిజిపేటలోని బ్యాంకుకు వెళ్లి రూ.2లక్షల డబ్బు తెచ్చుకున్నాడు.
గ్రామానికి వస్తుండగా వడ్ల బస్తాలు కాలిపోయినట్లు ఫోన్ రావడంతో తనతో ఉన్న డబ్బును అక్కడి తుప్పల్లో రహస్యంగా ఉంచి వెళ్లాడు. మంటలు ఆ ప్రాంతానికీ పాకి.. డబ్బు కాలిపోవడంతో.. లబోదిబోమన్నాడు.