టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారతదేశానికి స్వర్ణం తెచ్చినప్పటి నుంచి అథ్లెట్ నీరజ్ చోప్రాకు భారీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు ? అనే విషయంపై ప్రజలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒలంపిక్స్ కి వెళ్లక ముందు నీరజ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఆ తర్వాత ఆయన సాధించిన చారిత్రాత్మక విజయం నీరజ్ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేసింది.
అప్పటి నుంచి నీరజ్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఒలంపిక్స్ విజేతగా తిరిగి వచ్చాక పలు టీవీ యాడ్స్, టివి కార్యక్రమాలు, ఎండార్స్ మెంట్ అగ్రిమెంట్స్, అభినందన వేడుకలు, ఇంటర్వ్యూల తో బిజీ బిజీగా ఉన్నాడు 23 ఏళ్ల జావెలిన్ త్రో ఛాంపియన్. తాజాగా ఈ యంగ్ ఛాంపియన్ తన బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ దీనికి నిదర్శనం.ఆ పోస్ట్ లో నీరజ్ తన బిజీ లైఫ్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు.
ఇండియా గోల్డెన్ బాయ్ అని అని ఆయన అభిమానులు ప్రేమగా పిలుచుకునే నీరజ్ ఇటీవల ట్విట్టర్ లో ఓ అందమైన ద్వీపం ఫోటో పంచుకున్నారు. అందులో ‘అలారం ఆఫ్… వెకేషన్ మోడ్ ఆన్’ అని ట్వీట్ చేశారు. ఇక ఆ ఫోటో చూస్తుంటే నీరజ్ వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మాల్దీవులు అంటే సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా టెన్షన్ ను వదిలేసి ఆస్వాదించే ప్రదేశం. ఇప్పుడు నీరజ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.