సామాన్యంగా తండ్రి బాటలో కొడుకులు, కూతుళ్లు వెళ్తుండటం చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. అంటే కొడుకు బాటలో తండ్రి వెళ్తున్నాడన మాట. డాక్టర్ కావాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకోవడం కోసం 55 ఏళ్ల వయసులో నీట్ కి హాజరయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని మదురై వాసి అయిన కె.రాజ్యక్కొడి రైతు. ఆయనకు చిన్నతనం నుంచే డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించక ఆయన డిగ్రీ చదువును కూడా మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.కానీ చదువు మీద ఉన్న ఆశ, డాక్టర్ కావాలనే కోరిక మాత్రం చావలేదు.
వయసు పెరుగుతుండటంతో జీవితంలో ఇక డాక్టర్‌ని కాలేనేమో అని కూడా అనుకున్నాడు. కానీ ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి 64 ఏళ్ల వయసులో గతేడాది మెడికల్ కాలేజీలో సీటు పొందాడని తెలుసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. రోజుకు కనీసం మూడు గంటలు శ్రద్ధగా చదవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు.
రాజ్యక్కొడి చిన్న కొడుకు వాసుదేవన్ రెండో ప్రయత్నంలో నీట్ లో విజయం సాధించాడు. 521 మార్కులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. దీంతో కొడుకు స్టడీ మెటీరియల్‌నే తండ్రి చదవటం ప్రారంభించాడు. ఏడాదిపాటు ప్రిపేరయ్యాడు. మాక్ టెస్టులు కూడా ఎన్నో రాశాడు. మొత్తానికి మొన్న జరిగిన నీట్‌కు హాజరయ్యాడు.
మొన్న ఆదివారం జరిగిన నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి హాజరయ్యేందుకు విద్యార్థులతో పాటు లైన్లో నిల్చున్నాడు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లటానికి అతని వంతు రాగానే సెక్యూరిటీ గార్డులు ఆయన్ను ఆపారు. ఇంత వయసులో నువ్వు ఈ పరీక్ష రాయటానికి రావటమేంటి అనే అర్థం వచ్చేలా ఓ లుక్కిచ్చారు. వాళ్లు ఆపినందుకు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎవరికైనా ఆ అనుమానం వస్తుంది. దీంతో ఆయన తన చేతిలో ఉన్న హాల్ టికెట్‌ను చూపించగా మారుమాట్లాడకుండా లోపలికి అనుమతించారు.
దీంతో అక్కడ ఉన్నవారందరూ అవాక్కయ్యారు. తోటి విద్యార్థులు,తల్లిదండ్రులు,పరీక్ష కేంద్రం నిర్వాహకులు ముక్కు మీద వేలేసుకున్నారు. ఒకరికొకరు గుసగుసలాడుకోవటం మొదలు పెట్టారు కూడా.అయితే వీటిని వేటిని కూడా రాజ్యక్కొడి పట్టించుకోలేదు. ఎంతో శ్రద్ధగా తన పరీక్ష తను రాశాడు.
అంతేకాకుండా బయటకు వచ్చిన తరువాత ఫిజిక్స్,కెమిస్ట్రీ ప్రశ్నలు ఈజీగా వచ్చాయని చెప్పాడు. 460 మార్కులు వస్తాయని అంచనా వేస్తున్నాడు. తనకు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వస్తే డాక్టర్ కావాలనే జీవిత కలను సాకారం చేసుకుంటానని అంటున్నాడు.