వైద్యో నారాయణ హరి అన్నారు. కాని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం వైద్యులు వారి నిర్లక్ష్యం కారణంగా యమదూతల్లా మారుతున్నారు. అయితే వారి నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలన్న వాస్తవాన్ని మర్చిపోయి వ్యవహరిస్తూ.. ఆ పవిత్రమైన వృత్తికే మచ్చ తీసుకొస్తున్నారు.
ఆపరేషన్ చేసి పేషెంట్ కడుపులో దూది లేక కత్తెరను మర్చిపోయిన ఎన్నో సంఘటనలు వైద్య వృత్తికే కలంకాన్ని తెస్తున్నాయి. సర్కార్ దవాఖాకు పోతే..ప్రాణాల మీద ఆశ వదిలేయాలన్న సగటు పౌరుడి నానుడిని నిజం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొందరు వైద్యులు. తాజాగా మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి వైద్యుల నిర్లక్ష్యమే ఇద్దరు బాలింతల ప్రాణాలను మింగింది. వైద్యులు సకాలంలో చికిత్స అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు బాలింతలు మృతి చెందారు.
కాగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మృతి చెందారని బాధితులు మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆపరేషన్ వికటించడం కారణంగా మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై చాదర్ ఘాట్ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యం చేసిన వైద్య సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో వైపు ఆసుపత్రి సూపరిండెంట్ కూడా ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తు చేపడతామని బాధితులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించుకున్నారు.