తెలిసితెలియని వైద్యం చేయడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆర్‌ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మూడు నెలల బాలుడు చనిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం రంగాపురంలో ఉండే భూక్య బీరన్న మహేశ్వరి దంపతులకు చిన్న కుమారుడు పండు(3నెలలు). బాలుడికి జ్వరం రావడంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు భూక్యా హాలు వద్దకు తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన డాక్టర్ భూక్యహాలు… రెండు ఇంజెక్షన్లు వేసి ఇంటికి పంపించాడు.
ఇంటికి తీసుకుని వచ్చిన కొద్ది సేపటికే బాలుడి ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దీంతో బాలుడి మృతికి ఆర్ఎంపీ డాక్టరే కారణమని, ఆయన చేసిన ఇంజెక్షన్ వికటించి బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ వైద్యునిపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని చిన్నారి బంధువులు కోరుతున్నారు.