– తెలంగాణలో మహిళలపై అంతకంతకు పెరుగుతున్న అఘాయిత్యాలు
– నిందితులు దొరికినా.. న్యాయం జరిగింది 40శాతం మందికే..
– రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో రేప్, మిస్సింగ్ కేసులు
– రేప్ కేసుల్లో 40 శాతం దాటని శిక్షలు
– ప్రజల దృష్టిని మరల్చడానికి అప్పుడప్పుడు సంచలనాలు
– ఒకటీ రెండు కేసుల్లో రెచ్చిపోయ.. ఆ తర్వాత పట్టించుకోని వైనం
– భద్రతతో పాటు శిక్షలూ కావాలంటున్న మహిళ సంఘాలు
-ఎన్.సి.ఆర్.బి. లెక్కల్లో మహిళల క్రైం రేట్‌లో తెలంగాణకు 6 వ స్థానం.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది తెలంగాణలో మహిళా రక్షణ పరిస్థితి. దేశంలోనే నెంబర్ వన్ పోలిసింగ్, ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్.. ఆధునిక పరిజ్ఞాన వినియోగంలో ఫస్ట్ ప్లేస్.. అంటూ కేసీఆర్ సర్కార్ గొప్పలు చెప్పుకోవడం, జబ్బలు చరుచుకోవడమే గానీ.. అదంతా పైన పటారం, లోన లొటారమే. ఏడాదికేడాది తెలంగాణలో నేరాలు, ఘోరాలకు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళా రక్షణ అనేది ఓ మిథ్యగా మారిపోయింది.
మహిళలపై నేరాలకు పాల్పడిన వారిలో 50 శాతం మందికి కూడా శిక్షలు పడటం లేదు తెలంగాణలో. నిందితులకు శిక్షపడేలా చేసేందుకు కావాల్సిన అధారాలు సేకరించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలవుతున్నారు. సాధారణ కేసుల్లో 50 శాతం కన్విక్షన్ రేట్ ఉంటే.. మహిళల మిస్సింగ్, అత్యాచారయత్నం, అత్యాచారం, హత్యల వంటి కేసుల్లో అదే రీతిన శిక్షలు పడటం లేదు. మహిళలపై జరిగే నేరాల్లో.. 40 శాతం మాత్రమే కన్విక్షన్ రేట్ ఉండటం చూస్తే ప్రభుత్వం చిత్తుశుద్ధి ఎంతటితో ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ విషయం దేవుడెరుగు.. భక్షించిన వారిని శిక్షించడంలో కూడా ప్రభుత్వం, పోలీసులు విఫలవుతున్నారంటే వ్యవస్థ ఎంతటి దీనావస్థలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో ఏడాదికేడాది చిన్నారులు, యువతులు, మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. 2017 లో 17 వేల 521 కేసులు నమోదు కాగా, 2018లో 16వేల 27 కేసులు వెలుగుచూశాయి. 2019 చివరికల్లా ఆ సంఖ్య 18వేల 394 పెరగ్గా.. 2020 లో 19 వేలు దాటిపోయాయి.అత్యంత దారుణం ఏమిటంటే.. కరోనా కారణంగా గతేడాది జనసంచారం చాలా తక్కువ ఉంది. కానీ నేరాలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి అంటే.. వాటిని అదుపు చేయడంలో పోలీసులు ఎంతటి ప్రేక్షక పాత్ర పోషించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు రోజుకు పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. అదృశ్యమైన వారు దొరుకుతున్నారో.. లేదో.. కూడా సరైనా రికార్డులు మెయింటెన్ చేయడం లేదు. ఈ విషయం సాక్షాత్తూ హై కోర్టు విచారణలోనే బయట పడింది. మహిళల పట్ల నేరాలకు పాల్పడేవారి పట్ల షీ టీం షాడోగా ఉంటుందని చెప్పుకుంటున్నా.. అవి మత్తులో ఉండే యువకులను ఆటపట్టించడం లేదు. కేవలం పబ్లిక్ ప్లేస్‌కే పరిమితం అవుతున్నాయి. ఇక వరకట్న వేధింపులు ఏటా 150 నుంచి 200 కేసులు నమోదవుతున్నాయి. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించకపోవడడంతో.. అది కాస్త ఆత్మహత్యలు పెరగడానికి కారణమవుతోంది. రేప్ కేసుల విషయానికి వస్తే.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా సగటున 760 జరుగుతున్నాయి. ఇందులో బాధితులకు సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించకుండా, సెటిల్మెంట్ల రూపంలో కేసులను క్లోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లేదా ఆలస్యంగా స్పందిస్తుండటంతో సాక్ష్యాధారాలు దొరకుండా పోతున్నాయి. ఫలితంగా జీవితాన్ని ఛిద్రం చేసినవాడు.. బాధితుల కళ్ల ముందే రోజూ తిరుగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. చట్టాలు ఎంతో బలంగా ఉన్నా.. న్యాయవ్యవస్థలో విచారణ జరుగుతున్నా.. పోలీసుల స్పందన అలస్యం కావడంతో టెక్నికల్ గా వీగిపోతున్న కేసులో ఎన్నో ఉన్నాయి.
ఎన్‌కౌంటర్లతో అఘాయిత్యాలు ఆగుతాయా..?
దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. ఆ తర్వాత మహిళలపై అఘాయిత్యాలే జరగకుండా ఆపలేకపోయారు. మహిళలపై జరిగే నేరాలకు ఎక్కువసార్లు మూలాలు మద్యం, మత్తుపదర్థాలు, పోర్న్ సైట్స్.. అని చాలాసార్లు రుజువైంది. ఇక ప్రతిసారి ఎన్‌కౌంటర్ చేయలేరనే దుర్మర్గాపు అలోచనలు, తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయనే విషయాలపై అవగాహన కల్పించకపోవడం, శిక్షలను అమలు చేయడంలో విఫలమవ్వడం వంటవివి నిందితులు నిర్భయంగా నేరాలు చేయడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. నిర్బయ చట్టంలో మరణశిక్ష ఉంది. అయితే నిందితుడు అప్పీల్‌కి వెళ్లగానే పోలీసులు దీటైనా వాదనలను.. కింది కోర్టులో వినిపించినట్లు ఉన్నత న్యాయస్థానాల్లో వినిపించడం లేదు. దీంతో మధ్యలోనే అవి ఆగిపోతున్నాయి. మహిళ విషయంలో తప్పు చేసినవారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో తక్షణమే తెలిసేలా, అర్థమయ్యేలా చర్యలు తీసుకోగలగితే చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చు. కానీ ఆ దిశలో పోలీసుల ప్రయత్నాలు కనిపించడం లేదు.
ప్రభుత్వ న్యాయవాదులు ఎక్కడ?
బాధితుల తరుపున కోర్టుల్లో ఫైట్ చేయాలంటే ప్రభుత్వం తరుపున న్యాయవాదులు ఉండాలి. సత్వర న్యాయం జరగాలంటే వీరే ముఖ్యం. కాని రాష్ట్రంలో 350కి పైగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ శాఖ వీరిని నియమించుకోవడం లేదు. కొద్ది రోజుల క్రితం హైకోర్టు సుమోటోగా తీసుకుని మొట్టికాయలు వేస్తే.. 164 మంది పీపీల భర్తీకి నోటీఫికేషన్ ఇచ్చింది. మరోవైపు రాతపూర్వక పరీక్షకు 45 రోజుల సమయం ఇచ్చి భర్తీ ప్రక్రియను అలస్యం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి.. సోమవారం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. అక్టోబర్ 30 కల్లా విధుల్లో ఉండాలని అదేశించింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ప్రభుత్వం నేరాల నియంత్రణలో ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే.. నేరాల నియంత్రణ ఎలా సాధ్యమవుతుంది? మహిళలు, చిన్నారులకు న్యాయం ఎలా అందుతుంది?