రుచుల సీమ నెల్లూరు వెళ్లి చికెన్ తినాలని అనుకుంటున్నారా..
ఐతే, వన్ మినట్ ఆగండి..
అక్కడ దారుణం జరుగుతోంది.
నెల్లూరులో ఎవరైనా ఈపాటికే చికెన్ కొనివుంటే ఒకసారి చెక్ చేసుకోండి.
కుళ్లిన చికెన్ ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు.
ఆ గుట్టు ‘తొలివెలుగు’ బయటపెడుతోంది..
నెల్లూరు అంటే రుచుల సీమ.. కోస్తా జిల్లాల వారు తిరుపతి టూరుకు పోతూపోతూ మధ్యలో నెల్లూరులో ఆగి ఇక్కడ హోటళ్లు, రెస్టరెంట్లలో కడుపారా తిని వెళ్తుంటారు. ఈసారి మీరు అలా ప్లాన్ చేసుకుంటే.. ఒకసారి ఆగి ఆలోచించే సిట్యువేషన్ ఇప్పుడు అక్కడ ఉంది. ఏం లేదండీ! చెన్నైలో కుళ్లిన చికెన్ తీసుకొచ్చి నెల్లూరులో అమ్ముతున్నారు. అక్కడ చెత్త కుప్పలో పడేయాల్సిన చికెన్‌ను ఇక్కడ మనం తింటున్నామన్నమాట. నెల్లూరులో ఫుడ్ సేఫ్టీ అధికారుల కళ్లుగప్పి యథేచ్ఛగా సాగిపోతున్న కుళ్లిన చికెన్ దందా ఇప్పుడు బయటపడింది.
నెల్లూరు : వినడానికి ఇది షాకింగ్ న్యూసే మరి. చెన్నైలో కుళ్లిన మాంసాన్ని నెల్లూరులో విక్రయిస్తున్నారు. మద్రాస్ మహాపట్టణంలో పేర్గాంచిన చికెన్ సరఫరాదారుల దగ్గర చెడిపోయి పడేయాల్సిన చికెన్‌ను, కాస్తంత నిల్వ వాసన వచ్చే చికెన్‌ను , పెద్ద పెద్ద హోటళ్లు , రెస్టారెంట్లలో వాడకుండా వదిలేసే చికెన్‌ను కలెక్ట్ చేసి కొంతమంది స్వార్థపరులు ఒక ముఠాగా ఏర్పడి బోర్డర్ దాటిస్తున్నారు. చెన్నయ్‌కి దగ్గరలో వారికి బాగా బిజినెస్ జరిగే నగరం నెల్లూరే కావడంతో దాదాపు సరుకు అంతా అక్కడికే చేరుస్తున్నారు. దీని గురించి ఎవరికీ పెద్దగా ఆరా లేకపోవడంతో ఈ ముఠా ఆంధ్రలో ఈ కుళ్లిన చికెన్‌ను అయినకాడికి అమ్ముకుంటోంది. పాడయిన కోడి మాంసాన్ని జాగ్రత్తగా ఒక లారీకి ఎక్కించి వాళ్లు నెల్లూరు నగర శివార్లోని ఒక గోడౌన్‌కు చేరుస్తారు. చెన్నయ్‌లో వీరు అక్కడ నగర పాలక సిబ్బందిలా నటిస్తూ.. ఈ చికెన్ సేకరిస్తారు. కొన్ని చోట్ల అక్కడ హోటళ్లలో పని చేసే సిబ్బందితో కనెక్షన్ పెట్టుకుంటారు. వారికి ఎంతో కొంత ఇచ్చి వేస్ట్ చికెన్ ఇక్కడికి తెచ్చేస్తారు. మామూలుగా అయితే ఈ కుళ్లిన, చెడిపోయిన, లేదా చెడిపోతున్న మాంసాన్ని నగర పాలక సంస్థ సిబ్బంది జాగ్రత్తగా తీసుకెళ్లి తగలేస్తారు. తమిళనాడులో ఉన్న కోళ్లఫారాల్లో అనారోగ్యంతో, లేదా ప్రకృతి వైపరీత్యాలతో చనిపోయిన కోళ్లని కొని వాటి మాంసాన్ని ఇక్కడికి తెస్తున్నారు.
అంతాబాగానే ఉంది. మరి ఇలా కుళ్లిన చికెన్ ఎవరు కొంటారు ?
తినే వారికి తెలియదా అంటే తెలియదనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇలా తెచ్చిన చెడిపోయిన మాంసాన్ని వీళ్లు వాసన రాకుండా కొన్ని కెమికల్స్ కలుపుతారు. దాంతో అది ఫ్రెష్ చికెన్‌లానే అనిపిస్తుంది. దాన్ని తెచ్చి నెల్లూరు రిటైల్ చికెన్ మార్కెట్లో పెట్టి అమ్మిస్తారు. అంతేగాక, చుట్టు పక్కల హోటళ్లు, రెస్టరెంట్లకు అమ్ముతారు. కాస్త తక్కువధరకు అమ్మే సరుకు కావడంతో అందరూ వీరి దగ్గర కొంటుంటారు. రోడ్డుపక్కన బండ్ల మీద బిర్యానీ , చికెన్ పకడి అమ్మేవారు వీరికి మెయిన్ టార్గెట్. వాళ్లు దీన్ని చాలా తక్కువ రేటుకి కొంటుంటారు. ఎవరికైనా కాస్త అనుమానం వస్తే వారికి పైసలిచ్చి మేనేజ్ చేస్తారు. ఇలా పెద్ద హోటళ్లలో పనిచేసే సూపర్‌వైజర్లు , వంటవాళ్లు వీరితో కుమ్మక్కయి ఈ దందా నడిపిస్తున్నారు. ఈ చికెన్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఇటీవల తమ వ్యాపారం దెబ్చతిన్న కొందరు బడా చికెన్ షాపుల యజమానులు నిఘా పెట్టారు. రెగ్యులర్‌గా తమ దగ్గర చికెన్ కొనే హోటళ్ల వాళ్లు మానేసి వేరెవరి దగ్గర కొంటున్నారో మొదట్లో వీరికి అంతగా తెలియలేదు. తీరా ఆరాతీస్తే .. ఈ దందా బయటపడింది. దాంతో వారంతా ఈ సమాచారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకి చెప్పారు. వాళ్కు తనిఖీలు చేసి భారీఎత్తున చికెన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దఎత్తున చెడిన చికెన్ దందా నడుస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకి దిమ్మతిరిగింది. కుళ్లిన చికెన్ అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు .. దీన్ని రెగ్యులర్‌గా జనానికి అంటగడుతున్న రిటైల్ వ్యాపారులపై కూడా కన్నేశారు. కుళ్లిన మాంసాన్ని జనానికి పెడుతున్న రెస్టరెంట్లపై దాడులు చేసి భారీగా చికెన్ స్వాధీనం చేసుకున్నారు.