– పెన్నానది పొర్లుకట్టకి గండి
– కోవూరును ముంచెత్తిన వరద
– 26 గ్రామాలు మునక
– రైతన్నకు తీరని శోకం
– పునరావాసాల్లోనూ అవస్థలు పడుతున్న జనం
భారీ వరదలతో నెల్లూరు జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కోవూరు పరిసర ప్రాంతాలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయి. పెన్నా నది పొర్లుకట్టకి గండి పడడంతో భారీగా వరద నీరు పట్టణాన్ని ముంచెత్తింది. భవనాల్లోని మొదటి అంతస్తు వరకు నీరు చేరుకుంది.
పడుగుపాడు దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కోవూరు దగ్గర జాతీయ రహదారి కోతకు గురైంది. దీనివల్ల నెల్లూరు, విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడుతున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు అల్లాడిపోతున్నారు.
సోమశిల నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీ వస్తోంది. పెన్నా పరివాహక ప్రాంతాల్లోని 29 గ్రామాలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ వరద. ఇటు పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.
సోమశిల జలాశయం దగ్గర సోమేశ్వరాలయం దెబ్బతింది. గాలిగోపురం, కూలిపోగా.. విగ్రహాలు కొట్టుకుపోయాయి. జలాశయం సమీపంలో అమ్మవారి విగ్రహం గుర్తించి తీసుకొచ్చారు స్థానికులు. ఇటు భారీ వరదకి ఆలయం దగ్గర పురాతన శివలింగం బయటపడింది. సోమేశ్వర ఆలయం పునర్నిర్మాణం చేయాలంటున్నారు భక్తులు.