నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం కోటంరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. కోటంరెడ్డిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో మాగుంట లేఅవుట్ లోని కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది.
నెల్లూరులోని గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై వివాదం నెలకొంది. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నిరసన కార్యక్రమం తలపెట్టారు.
నిరసనకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. అయినా కోటంరెడ్డి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుండగా.. పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారని తెలుసుకున్న ఆయన అభిమానులు ఇంటికి చేరుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని మూడేళ్లుగా కోరుతున్నామని.. ముఖ్యమంత్రి సంతకాలు కూడా చేశారని అన్నారు. తాము విధ్వంసం చేయడం లేదని.. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు. పోలీసుల తీరు సరికాదన్నారు. క్రిస్టియన్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం రూ.7 కోట్ల నిధులు అడిగామని తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్.
పోలీసులను ఇంటి వద్దకు పంపి తనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. మనం నియంతల పాలనలో ఉన్నామా? లేక ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే విషయం అర్థం కావడం లేదని చెప్పారు కోటంరెడ్డి. కేసులు, అరెస్టులు, తుపాకులు, తూటాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని.. భవిష్యత్తులో గెరిల్లా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వైసీపీ పార్టీ వారు అడ్డగోలుగా రోడ్లపై మీటింగులు పెడితే రాని ఇబ్బందులు.. ప్రతిపక్షాలు శాంతియుతంగా కార్యక్రమాలు చేపడితే వస్తాయా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్.