నేపాల్ లోని పొఖారా విమానాశ్రయం వద్ద నిన్న యతి ఎయిర్ లైన్స్ విమానం కూలిపోయే ముందు యూపీకి చెందిన ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 72 మందీ దుర్మరణం పాలయ్యారు. వీరిలో అయిదుగురు భారతీయులున్నారు. యూపీ లోని ఘాజీపూర్ కు చెందిన సోను జైస్వాల్ అనే వ్యక్తి విమానం క్రాష్ అయ్యే ముందు తన సెల్ తో వీడియో తీస్తూ ఫేస్ బుక్ లైవ్ లో పోస్ట్ చేశాడు. మృతుల్లో ఈయనా ఉన్నాడు. ఇదే వీడియోను ఇతని ఫేస్ బుక్ అకౌంట్ లో కనుగొన్నారు.
.నేపాల్ కాంగ్రెస్ కు చెందిన నేపాల్ అండ్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ అభిషేక్ ప్రతాప్ షా.. ఈ వీడియో ఫుటేజీని ఓ మీడియా సంస్థకు పంపారు. విమానం కూలిన శిథిలాల వద్ద కనబడిన ఫోన్ లోని ఈ ఫుటేజీని తనకొక మిత్రుడు పంపాడని ఆయన తెలిపారు. ఒక నిముషం, 37 సెకండ్ల నిడివి గల ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండు ఇంజన్లు గల ఈ విమానం ఖాట్మండు నుంచి వస్తూ పొఖారా ఎయిర్ పోర్ట్ వద్ద క్రాష్ అయ్యే ముందు వలయాకారంగా తిరిగింది. హఠాత్తుగా పెద్ద శబ్దం వినబడి.. విమానం తలకిందులైపోయింది. క్షణాల్లో అంతా మంటలు.. ప్రయాణికుల హాహాకారాలు వినిపించాయి. మరో వీడియోలో ఈ ప్లేన్ కిందకు దిగుతూ అకస్మాత్తుగా ఎడమ వైపునకు తిరిగి అంతలోనే తలకిందులై మండిపోయిన దృశ్యం కనిపించింది.
ఈ ప్రమాదంలో సోను జైస్వాల్ సహా అనిల్ కుమార్ రాజ్ భర్, అభిషేక్ కుష్వాహా, విశాల్ శర్మ, సంజయ్ జైస్వాల్ మృతి చెందారు. వీరిలో మొదటి నలుగురు యూపీ లోని ఘాజీపూర్ కు , సంజయ్ జైస్వాల్ బీహార్ లోని సీతామర్హికి చెందినవారు. వాతావరణం బాగున్నప్పటికీ ఈ విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని భావిస్తున్నారు. .