నేపాల్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో 72 సీట్ల కెపాసిటీ గల విమానం రన్ వే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్టు తెలుస్తోంది. విమానం యతి ఎయిర్ లైన్స్ కు చెందినదిగా అధికారులు గుర్తించారు.
విమానం నేపాల్ రాజధాని ఖట్మండ్ నుంచి పొఖారా వెళుతుండగా ప్రమాదం జరిగింది. పొఖారా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు తెలిపారు.
సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసినట్టు చెప్పారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు స్థానిక అధికారి గురుదత్త దాఖల్ వివరించారు.
మొదట మంటలు ఆర్పి, ప్రయాణికులను రక్షించడంపై ఫైర్ సిబ్బంది, అన్ని ఏజెన్సీలు ఫోకస్ చేశాయని వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది తారా ఎయిర్ లైన్స్ విమానం కూలిన ఘటనలో 22 మంది మరణించారు.