భార్యాభర్తల మధ్య గొడవను పరిష్కరించాల్సిన ఖాకీలు కర్కశంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. దంపతులకు కౌన్సిలింగ్ చేసి గొడవ సద్దుమణిగేలా చేయాల్సిన పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. నెరేడ్ మెట్ కు చెందిన ముత్యాలును విపరీతంగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ముత్యాలు తన భార్యతో కలిసి నేరేడ్మెట్ అంతయ్య కాలనిలో నివసిస్తున్నాడు. ముత్యాలు ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ తెలెత్తింది. దీంతో ముత్యాలు భార్య కూకట్ పల్లిలో ఉండే తన తమ్ముడుకి ఫోన్ చేసి విషయాన్నీ చెప్పడంతో.. ముగ్గురు వ్యక్తులు వచ్చి తనపై దాడి చేసి వారే పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితుడు చెప్పాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వచ్చి తనను స్టేషన్ కి తీసుకెళ్లారని తెలిపాడు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై సైదులు తనను ఏమి అడగకుండానే రాత్రి 11.30 గంటల సమయంలో లాఠీతో విపరీతంగా కొట్టాడని బాధితుడు ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశాడు.