టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర సిరిసిల్ల నియోజకవర్గానికి చేరుకుంది. యాత్రలో భాగంగా శ్రీపాద 9వ ప్యాకేజీని పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. కమీషన్ల కక్కుర్తితో మంత్రి కేటీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టులన్నీ మంత్రి జేబు సంస్థలకే వెళ్తున్నాయని ఆరోపించారు. పనులు సరిగ్గా చేయడం లేదన్న నెపంతో కేటీఆర్ తన అనుయాయులకు అప్పగించారని విమర్శించారు.
కాలువ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచారన్న రేవంత్.. కడప జిల్లా వారికి కాంట్రాక్ట్ అప్పగించారని అన్నారు. లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని మండిపడ్డారు. పనులు ఆలస్యం కావడానికి , అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంత రైతులపై ఆ కాంట్రాక్టర్లకు ప్రేమలేదని చెప్పారు.
కేటీఆర్ కాంట్రాక్టర్లకు లొంగిపోవడం వల్లే పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. తక్షణమే 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలన్నారు. లేకపోతే దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకత్వం పోరాడుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు నెరేళ్ల బాధితులు రేవంత్ ను కలిశారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకునేలా చూడాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నెరేళ్ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.