అసెంబ్లీ ఎన్నికల వేళ..పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నేతాజీ సుభాష్ చంద్రబాస్ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఆయన్ను కీర్తిస్తున్నాయి. నేతాజీ జయంతి రోజైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలంటూ ఆ మధ్య తృణమూల్ కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కేంద్రం పట్టించుకోకపోయినా ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామంటూ ప్రకటించింది. అంతేకాదు మరోవైపు అదే రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళిగా పాదయాత్ర కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎన్డీయే కూడా రంగంలోకి దిగింంది.
నేతాజీ జన్మదినమైన జనవరి 23న ఏటా పరాక్రమ దివస్‌గా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడితోనే అయిపోలేదు.. అప్పట్లో నేతాజీ తన కార్యకలాపాలు నిర్వహించిన కోల్‌కతాలో.. జనవరి 23న ప్రధాని మోదీ పర్యటనకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని తెలుస్తోంది. అలా అటు తృణమూల్, ఇటు బీజేపీ ప్రభుత్వాలు పోటీపడి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవడం హాట్ టాపిక్‌గా మారింది.