ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. టాలీవుడ్ కు సంబంధించి ఈ యాప్ ఎప్పుడూ ఓటీటీ రేసులో లేదు. అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5 లాంటి సంస్థలు మాత్రమే తరచుగా సినిమాలు కొంటుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది నెట్ ఫ్లిక్స్.
కొత్త ఏడాదికి సంబంధించి ఏకంగా 16 తెలుగు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్. ఇందులో మహేష్-త్రివిక్రమ్ సినిమా, చిరంజీవి భోళాశంకర్ సినిమాలున్నాయి. వీటి తోపాటు విరూపాక్ష, టిల్లూ స్క్వేర్, అమిగోస్, మీటర్, బుట్టబొమ్మ, దసరా, ధమాకా, 18 పేజెస్.. ఇలా 16 సినిమాల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
నెట్ ఫ్లిక్స్ దూకుడుతో ఓటీటీ రంగంలో మరోసారి పోటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా టైమ్ లో నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్, ఆహా, హాట్ స్టార్, జీ5 లాంటి కంపెనీలన్నీ పోటీపడ్డాయి. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ దూకుడు తగ్గించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా మిగతా సంస్థలు కూడా స్ట్రీమింగ్ రైట్స్ తగ్గించడం మొదలుపెట్టాయి.
అమెజాన్ లాంటి కంపెనీ సైతం చిన్న సినిమాల్ని తీసుకోవడం మానేసింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ దూకుడుతో మిగతా ఓటీటీ సంస్థలు మరోసారి దూకుడు పెంచే అవకాశం ఉంది.