మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో చూస్తున్నాం. అయితే.. ఆమె వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు మండిపడుతుంటే.. సమర్ధించే వారు లేకపోలేదు. తాజాగా గీర్ట్ వైల్డర్స్ అనే నెదర్లాండ్ నాయకుడు… నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నూపుర్ శర్మపై మండిపడుతున్న అరబ్ దేశాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గీర్ట్. ఈ సందర్భంగా ఆమె మహమ్మద్ ప్రవక్త గురించి నిజమే మాట్లాడిందని అన్నారు. ఆయన గురించి నిజాలు మాట్లాడినందుకు అరబ్, ఇస్లామిక్ దేశాలు నూపుర్ శర్మపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని.. భారతదేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు.
ఇస్లామిక్ దేశాలను చూసి బెదిరిపోకూడదన్న గీర్ట్ వైల్డర్స్ .. శాంతి వచనాలు ఒక్కోసారి పరిస్థితిని మరింత దిగజార్చుతుందని తెలిపారు. నూపుర్ శర్మకు భారతీయులు అండగా ఉండాలని సలహా ఇచ్చారు. ‘‘బుజ్జగింపు అనేది ఎన్నటికీ పనిచేయదు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. కాబట్టి.. భారతదేశానికి చెందిన నా ప్రియమైన మిత్రులారా.. ఇస్లామిక్ దేశాలకు భయపడవద్దు. స్వేచ్ఛ కోసం నిలబడండి. నిజం మాట్లాడిన మీ నాయకురాలు నూపుర్ శర్మను సమర్థించండి. గర్వంగా, దృఢంగా నిలబడండి’’ అని సూచించారు గీర్ట్.
ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై చర్యలు తీసుకుంది బీజేపీ. ఆ తర్వాత వీరిద్దరి వ్యాఖ్యలపై కువైట్, ఖతార్, ఇరాన్.. భారత రాయబారులను పిలిపించి వివరణ కోరాయి. ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, మాల్దీవులు, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్ తో సహా అనేక ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాయి. వీటిలో కొన్ని దేశాలు బీజేపీ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే.. కొన్ని దేశాల్లో భారతీయ ఉత్పత్తులపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంపై వివాదం మరింత ముదురుతోంది. ఈ సమయంలో నెదర్లాండ్ నాయకుడు గీర్ట్ వైల్డర్స్ నూపుర్ వ్యాఖ్యలను సమర్థించడం హాట్ టాపిక్ గా మారింది.