మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు సోషల్ మీడియాలో విమర్శలు ఆగడం లేదు. తను ఇచ్చిన వివరణతో ఏ మాత్రం సంతృప్తి చెందని నెటిజన్లు మరింత రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థితికి చేరడంపై చర్చించేందుకు ఇటీవల పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌతం గంభీర్ హాజరుకాకపోవడంతో తమ ఎంపీ కనిపించడం లేదని…చివరి సారిగా ఇండోర్ లో జిలేబీ తింటూ కనిపించారని…ఎక్కడైన కనిపిస్తే తెలియజేయాలంటూ ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై స్పందించిన గౌతం గంభీర్…తాను ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ కామెంటేటర్ గా వెళ్లినందున కాలుష్యంపై మీటింగ్ కు హాజరు కాలేకపోయానని…తాను ఎంపీ కాకముందే ఆ కాంట్రాక్ట్‌కు అగ్రిమెంట్ జరిగిందని వివరణ ఇచ్చారు. అయినా ఒక ఎంపీగా కాలుష్య నివారణకు తాను చేయగలిగింది కూడా పెద్దగా లేదన్నారు. ఇక నుంచి ఉదయం 11 గంటల నుంచే ఆఫీసులో కూర్చుంటానని చెప్పారు. అవసరమైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో నియోజకవర్గమంతా గ్యాస్ ప్యూరిపయర్స్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే దీనికి ఏ మాత్రం సంతృప్తి చెందని నెటిజన్లు ట్రోల్స్ మాత్రం ఆపడం లేదు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన దాని కంటే కాంట్రాక్టే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు.