హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నియోజకవర్గంపై కురిపిస్తున్న వరాల వర్షంపై ఎవరికివారు తమకు తోచిన విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న కొన్ని పోస్టులు ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. అలా.. టీఆర్ఎస్ గూటికి చేరి 10రోజుల్లోనే ఎమ్మెల్సీ ఆఫర్ అందుకున్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఓ విశ్లేషణ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
అందరూ హుజురాబాద్‌లో దళిత బంధు అమలు గురించి మాట్లాడుతున్నారు కానీ.. అంతకంటే ముందే కేసీఆర్ అత్యంత ఖరీదుతో కూడిన కౌశిక్ బంధు అనే పథకాన్ని అమలు చేశాడని సెటైర్ వేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విశ్లేషణ కూడా చేశారు. ఉప ఎన్నికకు సంబంధించి తొలి లబ్దిదారుడు కౌశిక్ రెడ్డినే అని వారు తేల్చేశారు.
అదెలాగంటే.. దళితబంధు ద్వారా ఒక్కో కుటుంబం పొందేది కేవలం రూ .10 లక్షల ఆర్థిక సాయం మాత్రమేనని చెప్తున్న నెటిజన్లు.. MLC గా కౌశిక్ రెడ్డికి ఆరేళ్లపాటు కొన్ని కోట్లు సంపాదించబోతున్నాడని చెప్తున్నారు. ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డికి నెలకు జీతభత్యాలుగా రూ. 2.50 లక్షలు లభిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల కౌశిక్ రెడ్డికి 42 ఏళ్ల వయసు నుంచే నెలకు కనీసం రూ. 50 వేల పెన్షన్ దొరుకుతుందని.. ఆయన తదనంతరం అంతే పెన్షన్ జీవితాంతం ఆయన భార్యకూ అందుతుందని విశ్లేషిస్తున్నారు. ఇదంతా లెక్కిస్తే కౌశిక్ బంధు పథకం కింద.. తన జీవితకాలంలో కొన్ని కోట్ల రూపాయల లబ్ధి పొందుతాడని లెక్కలుగడుతున్నారు. హుజురాబాద్‌లో ఇంతకు మించిన కాస్ట్‌లీ పథకం ఇంకేముంది అని .. ముక్తాయింపునిస్తున్నారు.