– చినసారును ఆడుకుంటున్న నెటిజన్లు
– ట్విట్టర్ లో పేలుతున్న పంచ్ లు
– రాజకీయ నేతలు సైతం సెటైర్లు
కాలు జారింది.. మూడు వారాలు రెస్ట్.. ఓటీటీ షోస్ లిస్ట్ చెప్పండి అంటూ కేటీఆర్ చేసిన పోస్ట్ నెట్టింట మరో రచ్చకు దారితీసింది. ఆయనంటే పడని వాళ్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ త్వరగా కోలుకోవాలని అన్నారు. ‘‘మీ ఆనందం కోసం చూడటానికి కొన్ని షోలు ఉన్నాయి. కుట్ర సిద్ధాంతం, క్లౌడ్ బర్స్ట్, నీట మునిగిన ఇళ్లు, పంప్ హౌస్ లు’’ అంటూ కౌంటర్ వేశారు.
షర్మిల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని రీట్వీట్ చేస్తున్నారు. ఇటు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా కేటీఆర్ పై పంచ్ లు వేస్తున్నారు. రకరకాల కామెంట్స్ తో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ టిల్లు హ్యాష్ ట్యాగ్ చక్కర్లు కొడుతోంది. జులైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘దొంగ భయం.. ట్విట్టర్ టిల్లు. అన్ని సమయాలలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు యోగా చేయడం మంచిది’’ అని చేసిన ట్వీట్ ను ఇప్పుడు రీట్వీట్ చేస్తున్నారు నెటిజన్స్.
కొందరైతే ఇది డ్రామా అని అంటున్నారు. ‘‘కాలుకు అంత పెద్ద పట్టీ వేశారు.. సారు స్నానం చేయాలంటే ప్యాంట్ ఎలా తీస్తారు.. నిజంగా విరిగితే లుంగీ కట్టుకోవాలి కానీ ఇది ఏంది’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు గోవా మాజీ సీఎం పారికర్ ను గుర్తు చేస్తున్నారు. ఆయన చివరి నిమిషం వరకు పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. తమ నాయకుడు చివరి ఊపిరి వరకు ప్రజల కోసం ఈ దేశం కోసం పని చేస్తారని.. కేటీఆర్ మాత్రం కొద్దిగా దెబ్బ తాకితే చాలు ఫాంహౌస్ లో పండుకొని ఓటీటీలో సినిమాలు చూస్తూ హాయిగా విశ్రాంతి తీసుకుంటాడని చురకలంటిస్తున్నారు.
‘‘ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అయితాయా ఏంటి.. అలాగే నదులకు నడక నేర్పిన కేసీఆర్.. కేటీఆర్ కు నడక నేర్పకపోవడం చాలా బాధాకరం.. ఇది ఖండించదగ్గ విషయం’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు మరికొందరు. ‘‘ట్విట్టర్ టిల్లు కాలు జారిందా? బెనికితే ఫైల్స్ సూడలేవ? సమస్యలు వీసీ ద్వారా తెలుసుకునే తెలివి లేదా? సినిమాలు చూస్తాను చెప్పుండ్రి అని వర్షాలతో బాధపడుతున్న జనాలను అడుగుతున్నావు? పోకడ బంజేయ్, కాలు జారుడు మంచిది కాదు. గట్లుంటది గులాబీ పోకడ’’ అంటూ ట్విట్టర్ లో పంచ్ లు పేలుతున్నాయి.