ఏదైనా సందర్భం వస్తే చాలు.. తమ నాయకుడు శూరుడు, ధీరుడు అంటూ ఆకాశానికెత్తేసే కొటేషన్స్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కామన్ అయిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూల్స్ బ్రేక్ చేసి మరీ ఫ్లెక్సీలు, కటౌట్లు కడుతుంటారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేసి.. తర్వాత తీరిగ్గా ఫైన్లు వేస్తుంటారు. ఇలాంటివి అన్ని పార్టీలూ చేస్తున్నా.. టీఆర్ఎస్ మాత్రం ముందుంది. పార్టీకి సబంధించి ఏ కార్యక్రమం అనుకున్నా రెండు రోజుల ముందే నగరం గులాబీమయం అయిపోతుంటుంది.
మొన్న దసరా రోజున సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ అధికారికంగా ప్రకటన చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు జాతీయ పార్టీ పేరిట నగరం నలుమూలల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తన పరిధిలో విస్తృతంగా ఏర్పాటు చేశారు. అయితే.. సోమాజీగూడ సిగ్నల్ దగ్గర ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం వివాదానికి దారి తీసింది.
సదరు ఫ్లెక్సీలో దేశంలో ఎంత మంది ఉన్నా.. కేసీఆర్ లాంటి ఆలోచనాపరుడు ఒక్కడు ఉంటే చాలు అంటూ పొగడ్తలతో ముంచెత్తిన దానం.. అందులో ఉన్న ఇండియా మ్యాప్ ను గమనించలేదు. ఆయన కింద ఉండేవాళ్లు కూడా కొటేషన్ చూసుకుని ఫోటో సంగతి మర్చిపోయారో ఏమో.. కలర్ ఫుల్ గా ఉందని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు.
ఫ్లెక్సీలో ఇండియా మ్యాప్ తప్పుగా ప్రింట్ చేశారు. గుజరాత్, కశ్మీర్ ల భూభాగాలను తప్పుగా ముద్రించారు. దీంతో, ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున లేస్తే ఇండియా, చైనా బార్డర్ గురించి విమర్శలు గుప్పించే టీఆర్ఎస్ నేతలు.. మ్యాప్ రూపురేఖలను ఇష్టం వచ్చినట్టు మార్చేశారంటూ మండిపడుతున్నారు. సాగర్ గౌడ్ అనే బీజేపీ వ్యక్తి ఈ ఫ్లెక్సీలపై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు తాము పరిశీలిస్తామని కామెంట్ పెట్టారు.