ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి ఏ పని చేయాలన్నా దానికి ముందుగా గుర్తొచ్చేది సోషల్ మీడియానే. ముఖ్యంగా యువత ప్రతీ విషయాన్ని తన స్నేహితులతో పంచుకునేందుకు అదొక వేదికగా మారిందనడంలో అనుమానం లేదు. అయితే.. ఒక ఫోటోతో జీవితం మారిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఒక వీడియోతో అవకాశాలు వెల్లువెత్తిన సందర్భాలు ఉన్నాయి. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే ప్రతిభావంతులు బయటి ప్రపంచానికి పరిచయం అవడానికి అదొక గొప్ప వేదిక అయింది.
అలా సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి గురించి అందరికి తెలియడమే కాదు.. అతని కష్టం తీర్చేలా నెటిజన్లు సాయం కూడా చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అయ్యాయి. రాజస్థాన్ కు చెందిన దుర్గా మీనా అనే యువకుడు.. జొమాటోలో పని చేస్తాడు. ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా అతను సైకిల్ పై వెళ్లి సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తాడు.
అది చూసి ఆశ్చర్యపోయిన ఆదిత్య శర్మ.. అతని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని.. గతంలో టీచర్ గా పనిచేశానని, కరోనా టైంలో ఉద్యోగం పోవడంతో.. నాలుగు నెలలుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నానని మీనా చెప్పాడు. రోజు పది నుంచి 12 ఆర్డర్ లను చేస్తున్నట్టు తెలిపాడు.
అతని కథ విని చలించిపోయిన ఆదిత్య శర్మ.. మీనా గురించి అందరికీ తెలియజేయాలని అతని ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “ఈరోజు ఆర్డర్ నాకు సమయానికి డెలివరీ చేయబడింది. నన్ను ఆశ్చర్యపరిచే విధంగా డెలివరీ బాయ్ సైకిల్‌పై వచ్చాడు. రాజస్థాన్‌లోని 42 డిగ్రీల ఎండ కాస్తున్నా అతను నా ఆర్డర్‌ని సమయానికి డెలివరీ చేశాడు” అని డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఫోటోకు ట్యాగ్ చేసి షేర్ చేశారు. ఎవరైనా ఉంటే తోచిన సాయం చేయండి.. అతనికో బైక్ కోనిద్దాం అంటూ అతను పోస్ట్ చేశారు. అకౌంట్ వివరాలు ఇచ్చి.. ప్రతీ వ్యక్తి ఒక రూపాయి చొప్పున ఇవ్వాలని అభ్యర్థించారు.
దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు. కేవలం నాలుగు గంటల్లోనే 75 వేలు సమకూరాయి. అలా వచ్చిన డబ్బుతో ఆదిత్య శర్మ వెంటనే ఒక బైక్ ను కొనుగోలు చేసి.. మీనాకు అందజేశారు. దానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇంత మంచి పని చేసిన ఆదిత్య శర్మను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఏదిఏమైనా కష్టపడే ఓ వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా సాయం అందించింది. దీంతో మరోసారి సోషల్ మీడియా పవర్ ఏంటో తెలిసింది.