సీఎం కేసీఆర్ విచిత్ర నిర్ణయంపై సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. కరోనా వైరస్ పేరిట సీఎం కేసీఆర్ తీసుకున్న తెలంగాణ షట్‌డౌన్ కార్యక్రమంలో… అన్ని సంస్థలకు ఓకే నిర్ణయం కాకుండా బార్‌షాప్‌లకు కాస్త మినహాయింపు ఇవ్వటం చర్చనీయాంశం అవుతోంది. చదువులు అటకెక్కుతుంటే, శుభకార్యాలు ఆగిపోతుంటే తప్పదని సెలవిచ్చిన సీఎం కేసీఆర్ ఆ ఒక్క అంశంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం కేసీఆర్ కరోనా వైరస్‌పై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 500కోట్లు కాదు అవసరమైతే 5000కోట్లైనా ఖర్చు చేస్తాం అంటూ ప్రకటన చేశారు. అంతేకాదు తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించకుండా విద్యాసంస్థలు, థియేటర్లు, బార్‌లు, పార్క్‌లు మూసివేశారు. వీలైనంత తక్కువ మందిని పిలిచి పెళ్లి చేసుకోవాలని, మార్చి 31 తర్వాత పెళ్లిళ్లు పెట్టుకోవద్దు అంటూ ప్రకటన చేశారు.
అయితే, బార్ షాపులు కూడా ఈ నెల 31వరకు బంద్ ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ తెలంగాణ ఎక్సైజ్ ఉత్తర్వులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కేవలం వారం పాటు మాత్రమే బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే బార్‌షాపులు మార్చి 21 వరకు మాత్రమే బంద్ కాబోతున్నాయన్న మాట. అదే సమయంలో విద్యాసంస్థలకు మాత్రం ఈ నెలాఖరు వరకు మూసివేయాలని జీవోలు జారీ చేయటం విశేషం.
దీనిపై పలువురు మేధావులు మండిపడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ పిల్లల చదువులు ఇబ్బంది అయినా తాము ప్రభుత్వానికి సహాకరిస్తున్నామని, కానీ ప్రభుత్వానికి సంపద వచ్చే వాటి విషయంలో ఒకలా, ప్రజల విషయంలో మరొకలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని… ఇది ప్రభుత్వమా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా అంటూ ఫైర్ అవుతున్నారు.
ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయాల్సిన ప్రభుత్వాలు… ప్రజల విషయంలో మార్చి 31వరకు ఆంక్షలు విధించి, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టె క్లబ్బులు, పబ్బులు, బార్‌ల విషయంలో మాత్రం మార్చి 21వరకే ఆంక్షలు విధించటం ఎంతవరకు సరైందని పలువురు ప్రశ్నిస్తున్నారు.