ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నటుంది తెలంగాణ మంత్రుల బరితెగింపు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘిస్తోంటే.. తామేం తక్కువ తిన్నామా అన్నట్టుగా, ఆయననే స్ఫూర్తిగా తీసుకుని రెచ్చిపోతున్నారు. చట్టాలు సామాన్యులకే గానీ వాటిని చేసే తమకు కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే అటు హుజురాబాద్‌లో మంత్రులు హరీష్ రావు, గంగుల.. ఇటు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూల్స్‌ను గాలికొదిలేసి వీర విహారం చేశారు. ఓట్ల కోసం ఒకచోట.. ప్రచారం కోసం మరోచోట న్యూ ‘సెన్స్’ సృష్టించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తోంది ప్రభుత్వం. అక్కడికక్కడే చలాన్ రాసి చేతిలో పెడుతున్నారు పోలీసులు. కాళ్లావేళ్లాపడ్డా కనికరించకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కానీ అదే పోలీసులు .. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రదేశాల్లో పదే పదే, పలుమార్లు మాస్క్ లేకుండా కనిపించినా పైసా కూడా ఫైన్ వేసింది లేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోలీసులను ట్యాగ్ చేస్తూ.. లక్షలాది మంది నెటిజన్లు ప్రశ్నించినా స్పందించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల పోలీసుల భయం, భక్తి అలా ఉంటే.. . తాజాగా మంత్రులూ అలాంటి కుప్పిగంతులే వేస్తున్నా కళ్లుమూసుకుని ఉండిపోతున్నారు.
హుజూరాబాద్‌లో బుధవారం మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ బైక్ ర్యాలీ నిర్వహించారు.కేసీ క్యాంప్ నుంచి జమ్మికుంట వరకు నాన్‌స్టాప్‌గా నడిపి బలప్రదర్శన చేశారు. అది పరవాలేదు కానీ.. ఇక్కడే తాము మంత్రులం అనే దర్పాన్ని, అధికారమే తమ చేతిలో ఉందనే గర్వాన్ని ప్రదర్శించారు. కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రులు.. ఆసాంతం హెల్మెట్ పెట్టుకోనేలేదు. మంత్రి గంగుల అయితే మాస్క్ కూడా ధరించకుండానే ర్యాలీని వెలగబెట్టారు. సామాన్యుడు ఎవరైనా హెల్మెట్ లేకుండా కనిపిస్తే.. నడిరోడ్డుపైనే వాహనాన్ని నిలిపివేసి, నిలువుదోపిడి చేసినంత పనిచేస్తుంటారు పోలీసులు. కానీ హుజురాబాద్‌లో వారికి అవేం కనిపించలేదు. అసలు అలాంటి రూల్ ఒకటి ఉంటుందని కూడా పోలీసులకు గుర్తుకు రాలేదు.
గంగుల, హరీష్ రావు చేసిన ఘనకార్యం ఇలా ఉండగానే.. వారిని చూసి ఫాలో అయ్యారో లేక ఆయనకే ఆ ఆలోచన కలిగిందో తెలియదు కానీ.. సాక్షాత్తూ రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కూడా ట్రాఫిక్ నిబంధలను ఖమ్మంలో తొక్కిపడేసారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసేందుకు నగరంలో నానా హంగామా చేశారు. మోటార్ సైకిల్ పై స్వయంగా ఇంటింటికి వెళ్లి చెక్కులను అందించిన రవాణా శాఖ మంత్రి.. తానూ హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ ధరిస్తే.. నగర వీధుల్లో తన వైభోగాన్ని ఎవరూ చూడలేరేమో అని అనుకున్నారో ఏమో అది లేకుండా ఊరేగారు.
హుజురాబాద్, ఖమ్మంలో మంత్రుల బరితెగింపుపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. మంత్రులపై చర్యలు తీసుకుంటారా లేదా నెటిజన్లు ముక్తకంఠంతో నిలదీస్తున్నారు. రూల్స్ సామాన్యులేకేనా.. సర్కార్ పెద్దలకు కాదా అని ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ సీపీ, ఖమ్మం సీపీలకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ.. విరుచుకుపడుతున్నారు. చూడాలి మరి.. చట్టం అందరికి సమానమేనా లేక కొందరికి చుట్టం కూడా అవుతుందా అనేది!