మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిరణ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడ్డారు. గతంలో ఓసారి గోదావరి నది ఏపీ నుంచి తెలంగాణకు ప్రవహిస్తుందని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి పరువు తీసుకున్న సాయి కిరణ్ యాదవ్.. ముందు జాగ్రత్తగా చేసిన ఓ పని మళ్లీ మీమ్స్ క్రియేటర్లు, ట్రోల్ మేకర్లకు పని చెప్పింది.కేటీఆర్‌ను సీఎం చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం పార్టీ రాష్ట్రకార్యవర్గం సమావేశం కావడంతో.. కేటీఆర్‌ను సీఎంగా ప్రకటిస్తారని అందరూ బలంగా అనుకున్నారు. తలసాని సాయికిరణ్ కూడా అదే అనుకున్నారు అయితే.. శుభాకాంక్షలు చెప్పడంలో ఎక్కడ వెనుకబడిపోతాననో లేక అందరికంటే ముందే విష్ చేసి స్వామి భక్తి చాటుకుందామన్న ఆలోచనతోనో ముందుగానే వందల సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రింట్ చేయించి రెడీగా పెట్టుకున్నారు. కాంగ్రాట్యూలేషన్స్ అంటూ కేటీఆర్, తన తండ్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే తన ఫోటోలతో కూడిన బ్యానర్లను సిద్ధం చేసి ఉంచారు. తీరా పార్టీ సమావేశంలో కేటీఆర్‌ను సీఎం చేయడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పడంతో… సాయికిరణ్ ముందు జాగ్రత్తపై నెటిజన్లు సెటైర్ల మీద సైటెర్లు వేస్తున్నారు.