రైతులకు తెలంగాణ చేస్తున్నంత మేలు దేశంలో ఏ రాష్ట్రం చేయడం లేదు చర్చకు ఎవరొస్తారో రండి.. బీజేపీనా? కాంగ్రెసా?.. ఎవరైనా సరే బస్తీ మే సవాల్. ఇదీ.. ఐటీ మంత్రి, కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్న కల్వకుంట్ల తారక రామారావు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చకు తాను సై అన్నారు.
ఇటు.. ఎప్పటికప్పుడు రైతు సమస్యలని కళ్లకు కట్టి.. పరిష్కారాల కోసం సర్కార్ ను నిలదీసే ఏకైక మీడియా తొలివెలుగు సైతం కేటీఆర్ సవాల్ కు స్పందించింది. తక్షణమే తొలివెలుగు స్టూడియోను వేదికగా సిద్ధం చేసింది. కానీ.. సానుకూలంగా స్పందించిన రేవంత్ మాత్రమే స్టూడియోకు వచ్చారు. ఇక్కడే నెటిజన్ల మెసేజ్ ల వెల్లువ మొదలైంది.
అనేక మంది నెటిజన్లు కేటీఆర్ కు వేస్తున్న సూటి ప్రశ్నలివే!
– ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎంతో చేశాం అని చెప్తున్నారు కదా? దేశంలోని అన్ని రాష్ట్రాలు మా పథకాలే కాపీ కొడుతున్నారని పదే పదే అంటారు కదా? మరి.. బహిరంగ చర్చకు వచ్చి అవన్నీ చెప్పడానికి మీకు ధైర్యం ఎందుకు లేదు.
– సాక్షాత్తు ప్రధాని సైతం తెలంగాణను, తెలంగాణ సీఎంను చూసే నేర్చుకుంటారని చెప్తుంటారు కదా? మరి.. స్టూడియోకు వచ్చి మీ విజయాలను చాటుకోవాలంటే భయమెందుకు?
– మీరు పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చామని చెప్పుకుంటారు కదా? దళిత బంధు లాంటి ప్రపంచంలోనే లేని విధంగా గొప్ప గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టింది మేమే అని చెబుతారు కదా? ఇన్ని విజయాలు సాధించిన మీరు.. మిమ్మల్ని పదే పదే ప్రశ్నించే ప్రతిపక్షాల నోటికి దీటైన జవాబులతో తాళం వేయొచ్చు కదా? మరి ఎందుకు రాలేదు కేటీఆర్.
– అసలు.. అనేక మంది అభిమానులు కేటీఆర్ వస్తారు.. రైతుల కోసం కేసీఆర్ సర్కార్ చేసిన ప్రతీ గొప్ప పనిని ఇంకా గొప్పగా చెప్తారు.. అని ఎదురు చూసీచూసీ నిరాశకు గురయ్యారు. మరి.. చర్చకు రావాలంటే భయం దేనికి?
– అంటే.. తెలంగాణలో అన్నదాతలు సంతోషంగా లేరా? తెలంగాణలో అన్నదాతలు అప్పుల పాలయ్యారా? తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయా? అసలు.. సమస్యల వలయంలో తెలంగాణ జనం చిక్కుకుపోయారా? ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో అసలేం చేయలేదా? చర్చకు మీరు రాకుంటే.. మీ అభిమానుల మనసుల్లో తలెత్తుతున్న సందేహాలు ఇవే.