ఆయన ఓ కలెక్టర్. జిల్లాలోని అధికారులందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆఫీసర్. కానీ ఆయనే గణతంత్ర దినోత్సవ సాంప్రదాయాన్ని తుంగలో తుక్కారు. సాధారణంగా దేశ, రాష్ట్రాల రాజధానుల్లో రిపబ్లిక్ వేడుకలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో.. జిల్లా కేంద్రాల్లోనూ అంతే సందడిగా నిర్వహిస్తుంటారు. ఇక జిల్లాకు అత్యున్నత అధికారి హోదాలో కలెక్టర్‌కు దక్కే గౌరవం కూడా అంతా ఇంతా కాదు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించడమే కాదు.. ఆయన చేతుల మీదుగానే స్వాతంత్ర్య సమరయోధులు, ఉత్తమ అధికారులకు సన్మానం వంటివి జరుగుతుంటాయి. అంతా అయ్యాక ఏ జిల్లా కలెక్టర్ అయినా చేసే అతి ముఖ్యమైన పని.. జిల్లా ప్రగతి నివేదికను సభా వేదికగా చదివి వినిపించడం. ఆనీ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్‌కు అది ఏమాత్రం పట్టలేదు.
కలెక్టర్ వెంకట్ రావు మహబూబ్‌నగర్ జిల్లా ప్రగతి నివేదికను చదవకుండానే వేడుకలని ముగించారు. కలెక్టర్ ఆరోగ్యం బాగాలేదేమో.. అందుకు చదవలేదేమో అందరూ అనుకుంటోంటే.. తిరిగి ఆయనే అందుకు కారణాన్ని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రగతి నివేదికను చదవలేకపోతున్నా అని సభాముఖంగా ప్రకటించారు. నివేదిక చదివితేనే కరోనా వస్తుందేమో అన్న తరహాలో మాట్లాడారు. హైదరాబాద్‌లో గవర్నర్ రాష్ట్ర ప్రగతి నివేదికను చదవగా లేనిది.. కలెక్ట్‌కు మాత్రమే ఆ కరోనా అడ్డురావడం విడ్డూరంగా ఉందని జెండా పండుగకు హజరైన వారంతా పెదవి విరిచారు. ఇక కోవిడ్ కారణంగా ప్రగతి నివేదికను చదవలేకపోతున్నాని చెప్పిన కలెక్టర్.. పత్రులను పంపిణీ చేస్తాం.. చదువుకోగలరని చెప్పడం కొసమెరుపు.