పిల్లల పాఠ్యాంశాలలో మన సంస్కృతి గురించి, గొప్ప గొప్ప చరిత్ర కారులు, రాజుల గురించి వివరించాలంటూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు పెట్టిన విన్నపం కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అక్షయ్ నటించిన చిత్రం పృథ్వీరాజ్ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అది ఏంటంటే చిన్నతనం నుంచే పిల్లల పాఠ్య పుస్తకాలలో గొప్ప చరిత్ర కారుడు, రాజు అయిన పృథ్వీ రాజ్ గురించి తెలియజేయాల్సి ఉన్నప్పటికీ ఆయన గురించి ఎక్కడా లేదని పేర్కొన్నాడు. దీని గురించి పట్టించుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ కు విన్నవించాడు.
అయితే.. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త చర్చానీయాంశంగా మారింది. దానిని చూసిన కొందరు నెటిజన్లు.. అక్షయ్ మా చిన్నప్పుడు మేము పృథ్వీరాజ్ గురించి మా పాఠ్యాంశాలలో చదువుకున్నాం. నువ్వు దానిని తెలుసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
దీని గురించి తెలుసుకోవాల్సింది పిల్లలు కాదు.. ముందు నువ్వు అంటూ మరో నెటిజన్ అక్షయ్ కు సూచించాడు. మరికొందరు ఆ రాజు గురించి ఉన్న పాఠ్యాంశాన్ని ఫొటో తీసి మరి ట్యాగ్ చేశారు. ఇంకొందరు అక్షయ్ నువ్వు ఎక్కడ చదువుకున్నావ్? అంటూ ప్రశ్నలు సంధించారు.
కేవలం మన చరిత్ర పుస్తకాలలో మొఘలుల గురించి మాత్రమే కాకుండా మన రాజుల గురించి కూడా వివరించారు అంటూ నెటిజన్స్ పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటించిన పృథ్వీరాజ్ శుక్రవారం విడుదల కానుంది.