దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ వివాదంలో చిక్కుకున్నారు. దానిమీద సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. హిందూ దేవాలయాల రక్షకుడిగా ఉండాలసిన దేవాదాయ మంత్రి ఓ క్రిస్టియన్ సభకు హాజరై విమర్శలు కొనితెచ్చుకున్నట్టు చెబుతున్నారు. వెల్లంపల్లితో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మల్లాది విష్ణును కూడా సోషల్ మీడియాలో వదలిపెట్టడం లేదు. ఏకిపారేస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ఆ సభకు హాజరయ్యారని కథనం.
గుంటూరు: హిందువులకు సంబంధించి పదవుల్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు క్రిస్టియన్ సభకు వెళ్ళడం పట్ల హిందువులు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఏఐసీసీ కమిటీకి చెందిన కొందరు క్రిస్టియన్లు నగరంలో క్రైస్తవుల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి వెల్లంపల్లితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్‌లను ఆహ్వానించారు. ఆ ఆహ్వానానికి తగిన విధంగా వెల్ కమ్ బ్యానర్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సభకు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణు వెళ్ళడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హిందువులకు సంబంధించిన పదవుల్లో ఉండి అన్యమత సభకు ఎలా వెళ్ళతారని పలువురు విమర్శిస్తున్నారు. వీరికి సంబంధించిన బ్యానర్‌ని సోషల్ మీడియాలో పెట్టి చాలా మంది ఏకేస్తున్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఏదో క్రిస్టియన్ కార్యక్రమానికి హాజరయ్యారని తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే పని చేయడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో ఇలాంటి విషయాల్లో టీడీపీని విమర్శించిన పండితోత్తములు, బీజేపీ పెద్దలు ఇప్పుడు ఏమైపోయారని మండిపడుతున్నారు. మరి ఈ విమర్శలపై మంత్రి, ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.