టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ ఎప్పుడూ ఓ వింత.. ఓ విడ్డూరం.. కానీ, అందాల తార శ్రీదేవిని మైనపు బొమ్మగా తీర్చిదిద్దిన తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల్లో పెదవి విరుపు కనిపిస్తోంది. ఈ మైనపు బొమ్మ అంత మైమరచిపోయేలా ఏంలేదన్నది శ్రీదేవి వీరాభిమానుల వాదన. ఆ అతిలోక సుందరి బొమ్మ కళ్లింతలు చేసుకునేంత గొప్పగా లేదని కామెంట్.
వాస్తవానికి శ్రీదేవి అభిమానులనే కాదు సగటు సినీ ప్రేమికులను కూడా ఈ విగ్రహం నిరాశకు గురిచేసింది. బొమ్మలు మాట్లాడతాయి. కథలు చెబుతాయి. రంగుతోనో, రూపంతోనో, మార్మికం అనుకునే సౌందర్యంతోనో మాయ చేస్తాయి. కానీ ఆ కనికట్టు విద్య ఇక్కడేం కనిపించలేదు. మరణించిన రెండేళ్ల తరువాత సింగపూర్ బొమ్మల కొలువులో కొలువు తీరిన మన తెలుగింటి తెరవేల్పును తీర్చిదిద్దిన తీరు ఏమాత్రం బాలేదని నెటిజెన్ల వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు సామాజిక మాధ్యమాల్లో దీనిపై స్పందించారు. అతిలోక సుందరి బొమ్మ కళాత్మకంగా లేదని, ఇది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం స్థాయి బొమ్మ కాదని అంటున్నారు. గతంలో కొలువుదీరిన భారతీయ నటుల స్థాయిలో ఈ బొమ్మ లేదని, ఓ విధంగా ఈ పరిణామం తమనెంతో నిర్ఘాంతపరిచిందని వారి స్పందన. కథగానో.. కల్పనగానో.. జీవితం ముగిసిపోయాక ఇప్పుడీ కొత్త బొమ్మ రూపంలో పలకరిస్తున్నశ్రీదేవి ఆనాటి వైభవ ప్రాభవానికి ఆనవాలు కాదు.. అన్నది సుస్పష్టం.