తమిళనాడు రాష్ట్రం పేరు మార్చాలని తాను సూచించినట్టుగా వచ్చిన వార్తలను గవర్నర్ ఆర్.ఎన్. రవి తోసిపుచ్చారు. ఈ రాష్ట్రం పేరును తమిళనాడు బదులు ‘తమిళగం’ అని మార్చాలని ఆయన సూచించినట్టు వార్తలు రావడంతో అది పెను వివాదానికి దారి తీసింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో పాలక, విపక్ష సభ్యులు ఆయనపై విమర్శలతో విరుచుకపడగా.. చివరకు ఆయన కూడా సభ నుంచి ‘వాకౌట్’ చేయాల్సి వచ్చింది.
ఆ తరువాత కూడా రాష్ట్రంలోని పలు చోట్ల విద్యార్థులు ‘గో బ్యాక్ గవర్నర్’ అని రాసి ఉన్న పోస్టర్లతో వీధి గోడలను నింపేశారు. ఇన్ని పరిణామాల మధ్య ఆయన బుధవారం.. తన ‘పొరబాటును’ తెలుసుకున్నట్టు ఉన్నారు. ఈ రాష్ట్రం పేరును మార్చాలన్నది తన అభిమతం కాదని, అసలు తన ప్రసంగంలోని బేసిస్ ని అర్థం చేసుకోకుండా ఈ వివాదాన్ని లేవనెత్తారని అన్నారు.
దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ వివరణనిస్తున్నానని పేర్కొన్న ఆయన.. తమిళ ప్రజలకు, కాశీకి మధ్య ఉన్న చరిత్రాత్మక సాంస్కృతిక సంబంధాల నేపథ్యంలో తాను ‘తమిళగం’ అన్న పదాన్ని ఉచ్చరించానన్నారు.
ఒకప్పటి రోజుల్లో తమిళనాడు ఉండేది కాదని, అందువల్లే ఈ పదం దీనికి సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డానని తెలిపారు. ‘నా స్పీచ్ లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా నేను తమిళనాడుకు వ్యతిరేకం అన్నట్టు ఇది ఓ ‘టాపిక్ ఆఫ్ డిస్కషన్’ గా మారిపోయింది’ అని రవి వ్యాఖ్యానించారు. ఇక నా ఈ వివరణతో నైనా ఈ వివాదం సద్దు మణుగుతుందని ఆశిస్తున్నానని ఓ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.