పూర్వవైభవమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఏఐసీసీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న 23 మంది సీనియర్లతో భేటీ తర్వాత పార్టీ అధినేత్రి భారీ మార్పులకు సిద్దమయ్యారు. ఈ మేరకు త్వరలో తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల పీసీసీలను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నాయకత్వం మార్పు అనివార్యమని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక ఉప ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ.. గుజరాత్ పీసీసీ చీఫ్ అమిత్ చడ్వా కూడా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కమల్‌నాథ్ తాను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.పంజాబ్‌లో పీసీసీ మార్పు ప్రచారం జరగుతోంది. వీటితో పాటు మరిన్ని రాష్ట్రాల్లోనూ నాయకత్వ మార్పు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపుగా జరిగిపోయింది. దాదాపుగా రేవంత్ రెడ్డికే పదవి ఖాయమని తేలిపోయింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్న పరిస్థితి నెలకొంది.