కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకన్న తర్వాత ఈ ఏడాది పాటు తాత్కాలిక చైర్మన్ గా రంగనాథ్ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సీఈవోగా సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డేను నియమించారు.
మాళవిక కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె. అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె గతంలోనే చెప్పారు. అందుకు తగ్గట్లుగానే గత ఏడాది కాలంగా కంపెనీ అప్పులను తగ్గించుకుంటూ వస్తుంది.
బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డే భారతదేశం అంతటా వందలాది కాఫీ షాపులను నిర్వహిస్తోంది. ఇవి భారతదేశంలో వృద్ధి చెందుతున్న ఎన్నో ప్రముఖ బ్రాండ్లతో కాఫీ డే పోటీ పడుతుంది. కానీ సిద్ధార్థ మరణంతో కాఫీడే భవిష్యత్ పై అనుమానాలు వచ్చినప్పటికీ తిరిగి కంపెనీని నిలబెట్టే బాధ్యత తన భార్యే తీసుకుంది.