ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నా.. సీఎంను మార్చి గుజరాత్ లో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది బీజేపీ అధిష్టానం. ఈమధ్యే విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించి భూపేంద్ర పటేల్ ను సీఎం చేసింది. సోమవారం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం కూడా చేశారు. తాజాగా భూపేంద్ర సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.
మొత్తం 24 మంది మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. 24 మందిలో 10 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 14 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. అయితే మాజీ సీఎం విజయ్ రూపానీ మంత్రివర్గంలోని ఒక్కరికీ చోటు దక్కలేదు. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేదికి కేబినెట్ లో చోటు దక్కింది.
ఇక ప్రమాణ స్వీకారం చేసిన ఇతర నేతల్లో హృషికేష్ పటేల్, నరేశ్ పటేల్, ప్రదీప్ పర్మార్, జీతూ వఘానీ, కానూభాయ్ దేశాయ్, కిరీట్ సింహ్ రాణా, రాఘవ్ జీ పటేల్, అర్జున్ సింహ్ చౌహాన్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు.