కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం అన్ని పద్దులు సరిచేస్తోంది. కీలకమైన ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ పై బాగా కసరత్తులు చేస్తోంది. బడ్జెట్ సెషన్స్ కి ముందు దేశానికి కొత్త చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ)గా డాక్టర్ అనంత నాగేశ్వరన్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అతని స్థానంలో ఉన్న కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకొని గత ఏడాది డిసెంబరులో ఆ పదవి నుంచి తప్పుకున్నారు.
అయితే.. అప్పుడు నుంచి ఆ స్థానంలో ఎవరూ నియామకం కాలేదు. బడ్జెట్ సమావేశాల ముందు ఆయన్ని నియమించడం గమనార్హం. బడ్జెట్ పై జరిగే కసరత్తులు, లెక్కలు సరిచేసేందుకు ఆర్థికవేత్తలు, అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం నార్త్ బ్లాక్‌లో లాక్‌ఇన్‌లోకి గురువారం పంపింది. గురువారం లాక్ఇన్ మొదలైన తరువాత 24 గంటల్లో కొత్త చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ)గా డాక్టర్ అనంత నాగేశ్వరన్ ను నియమించారు.
దీంతో.. ఈ బడ్జెట్ లో ఆయన పాత్ర ఉంటుందా? ఉండదా అనే చర్చ జరుగుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఈనెల 31న ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీని తర్వాత ఫిబ్రవరి 1న బడ్జెట్ 2022ను కూడా ప్రవేశపెడతారు. గడిచిన ఏడేళ్లలో పనిచేసిన ముగ్గురు ఆర్థిక సలహాదారులూ దక్షిణాదికి చెందినవారే. కొత్తగా ఈ స్థానంలో నియామకం అయిన అనంత నాగేశ్వరన్ తమిళనాడులోని మధురైకి చెందినవారు.
ఈయన 1985లో అహ్మదాబాద్‌లోని ఐఐఎం పూర్తిచేశారు. ఆ తర్వాత 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుండి ఫైనాన్స్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. స్విట్జర్లాండ్‌లోని అనేక ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్‌ల పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ఐఎఫ్‌ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కి కొంత కాలం డీన్‌గా కూడా పని చేశారు. నాగేశ్వర్ భారతదేశం, సింగపూర్‌లోని అనేక బిజినెస్ స్కూల్స్, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా ప్రొఫెసర్ గా పనిచేశారు. క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజీ, జూలియస్ బేర్ గ్రూప్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన నాగేశ్వరన్ కన్సల్టెంట్, రచయిత, అకాడమీషియన్ గానూ కొనసాగుతున్నారు