– కర్నాటక సీఎం మార్పుపై జోరుగా చర్చ
– అమిత్ షా టూర్ తర్వాత మారిన సమీకరణాలు
– శోభా కరంద్లాజేను సీఎం చేస్తున్నట్లు ప్రచారం
– రేపో మాపో అనౌన్స్ మెంట్!
కర్నాటకకు ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. నెక్ట్స్ ఏప్రిల్-మేలో ఎలక్షన్ సందడి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఒక్క కర్నటకలోనే. ఉత్తరాదిన హవా కొనసాగుతున్నా.. దక్షిణాదిలో ఉన్న ఒక్క రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించాలంటే భారీ మార్పులు తప్పదని భావిస్తోంది అధిష్టానం. తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా టూర్ తర్వాత అక్కడ సీఎం మార్పుపై ఊహాగానాలు పెరిగిపోయాయి. బసవరాజ్ బొమ్మైని మార్చాల్సిందేనని అధికశాతం మంది పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తర్వాతి సీఎం ఎవరనే చర్చ జరుగుతుండగా.. శోభా కరంద్లాజే పేరే ఎక్కువగా వినిపిస్తోంది. రేపో మాపో సీఎం అనౌన్స్ మెంట్ ఉంటుందని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
శోభా కరంద్లాజే ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. మాజీ సీఎం యడియూరప్ప హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు అత్యంత నమ్మకస్తురాలుగా ఈమెను చెబుతుంటారు. వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. కోస్తా కర్నాటకలోని పుత్తూరుకు చెందిన శోభ ఆర్‌ఎస్‌ఎస్ లోనూ పని చేశారు. 2008లో బెంగళూరులోని యశవంతపుర నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడ్యూరప్ప ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రిగా పని చేశారు. మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు ఉంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఉన్నారు. గతేడాది జులై 28న ఈయన సీఎంగా ప్రమాణం చేశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై.. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరారు. బొమ్మైకి ముందు యడియూరప్ప సీఎంగా కొనసాగారు. 2019 జులై 26 నుంచి 2021 జులై 27 వరకు పనిచేశారు. కర్నాటకలోని 20 శాతం ఓట్లు ఉన్న లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నేత. ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మై కూడా లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారు. ఆ వర్గం ఓట్లు అధికశాతం బీజేపీకే పడుతుంటాయి.
ఇక రాష్ట్రంలో మరో కీలక సామాజికవర్గం వక్కళిగ. వీరు 12 శాతం వరకు ఉన్నారు. జేడీఎస్ పార్టీకి ప్రధాన బలం ఈ సామాజికవర్గమే. ప్రతీ ఎన్నికలకు జేడీఎస్ వల్లే బీజేపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వక్కళిగ సామాజికవర్గంపై దృష్టి సారించిన అధిష్టానం దానికి చెందిన నేతనే సీఎం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో వక్కళిగ సామాజికవర్గానికి చెందిన కీలక నేత ఎవరంటే.. వెంటనే శోభా కరంద్లాజేనే గుర్తుకొస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే.. శోభను రంగంలోకి దింపాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
యడియూరప్పకు నమ్మకస్తురాలు కావడంతో బొమ్మైని మార్చినా లింగాయత్ సామాజికవర్గం నుంచి ఎలాంటి సమస్య ఉండదనే భావనలో బీజేపీ ఉన్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. అదీగాక.. వక్కళిగలు తమకు యాడ్ అయితే విజయం పక్కా అని గట్టిగా ఫిక్స్ అయి శోభాను సీఎం చేయాలని చూస్తున్నారని అంటున్నారు. రేపే మాపో సీఎం మార్పు ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు.