రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్లను శాంతింపజేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పీసీసీలో చోటుదక్కని వారి కోసమే అన్నట్టుగా ప్రత్యేకంగా మరో కమిటీని ప్రకటించింది. ఇప్పటివరకున్న టీపీసీసీ కోర్ కమిటీ స్థానంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని నియమించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ అధ్యక్షతన నడిచే ఈ కమిటీలో.. అటు రేవంత్ రెడ్డి వర్గానికి, ఇటు అసంతృప్తులకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసింది.
రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కన్వీనర్‌గా, 14 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది ఏఐసీసీ. పీసీసీ చీఫ్ పదవి కోసం ఆశపడిన భట్టివిక్రమార్క, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబుతో పాటు మాజీ పీసీసీ చీఫ్‌లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, వి.హనుమంతరావు, మాజీ మంత్రులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరాంనాయక్, పార్టీ సీనియర్లు పొడెం వీరయ్య, సీతక్కకు సభ్యులుగా అవకాశం కల్పించింది. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్‌చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ ప్రకటించిన ఇతర కమిటీల చైర్మన్లకు తాజా కమిటీలో స్థానం ఉంటుందని ఏఐసీసీ స్పష్టం చేసింది.
రేవంత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తర్వాత, కొందరు ముఖ్య నేతలకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. తాజా కమిటీలో వారందరకీ స్థానం కల్పించడంతో వారి వర్గాల్లో ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తున్నారు.