– హస్తం పార్టీలో చిచ్చు పెట్టిన సిన్హా పర్యటన
– రేవంత్ మాటను లెక్కచేయని వీహెచ్
– టీఆర్‌ఎస్ నేతలతో కలిసి సిన్హాకు స్వాగతం
– భట్టి తీరునూ ప్రశ్నించిన జగ్గారెడ్డి
– నేతల మధ్య మొదలైన రగడ
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ లో కొత్త వివాదానికి కారణమైంది. సిన్హాకు కాంగ్రెస్ మద్దతు ఉంది. కానీ.. టీఆర్‌ఎస్ పిలిపించిన నేతను తాము కలవమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో.. హస్తం నేతలెవరు బేగంపేట వైపు చూడరని అంతా అనుకున్నారు. కానీ.. సీనియర్ నేత వీ హనుమంతరావు మాత్రం అక్కడ ప్రత్యక్షమయ్యారు. కేసీఆర్, కేటీఆర్ తోపాటు సిన్హాకు స్వాగతం పలికారు.
పార్టీ అధ్యక్షుడి మాటను లెక్కచేయకుండా వీహెచ్ బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లడంతో కాంగ్రెస్ లో చిచ్చు చెలరేగింది. ఈ రచ్చ కొనసాగుతుండగానే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. యశ్వంత్ సిన్హాని అధిష్టానంతో మాట్లాడి భట్టి విక్రమార్క సీఎల్పీకి ఆహ్వానిస్తే బాగుండేదని అన్నారు. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. యూపీఏలో టీఆర్‌ఎస్ భాగ్యస్వామ్యం కాకపోయినా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హాని ఆహ్వానించిందని.. కాంగ్రెస్ పార్టీ, సీఎల్పీ పక్షాన మనం కూడా పిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో లేని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సిన్హాని సీఎల్పీకి పిలిపించి మద్దతు తెలిపితే బాగుండేదని అన్నారు. దీనిపై భట్టి విక్రమార్కని తప్పు పడుతూ ఢిల్లీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు. అంతే కాదు, సిన్హా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తానని.. దొరికితే మద్దతు ప్రకటిస్తానని వెల్లడించారు.
మరోవైపు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే తీసి గోడకేసి కొడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.