‘స్వామివారి దర్శనం చేసుకో పో.. ప్రాయశ్చిత్తం అవుతుంది…’ అంటుండడం వింటూంటాం. తప్పులు చేసి, పాపాలు చేసి చేసి చివరకు వాటిని కడుక్కోడానికి తిరుమలకు పోతారు కొందరు. స్వామివారి ముందు చేసిన తప్పులు ఒప్పుకుంటే దండన ఉండదన్నది వారి ఆలోచన. ఇంకొంత మంది ముదుర్లు ఏకంగా శ్రీవారి దగ్గరే స్థానం సంపాదించాలని చూస్తారు. అందుకే టీటీడీ పాలకమండలిలో స్థానం కోసం దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ వుంటుంది.
తాజాగా జగన్ సర్కార్ ప్రకటించిన టీటీడీ పాలక మండలి జాబితా వివాదాస్పదం అవుతోంది. ఈ నియామకాలపై అపుడే విమర్శలు మొదలయ్యాయి. టీటీడీ పదవి రాజకీయ పదవా.. అని కొందరు దుయ్యబడుతుంటే, మరి కొందరు ‘టీటీడీ అసలు ఏపీలోనే ఉందా…’ అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో ఇక దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ధార్మిక, ఆధ్యాత్మిక, సేవాగుణం, హిందుత్వ భావనలు ఉన్నవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరని కొంతమంది తేల్చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పవిత్రమైన వెంకన్న సన్నిధి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోతోందని కొందరు విమర్శిస్తున్నారు. ఆశ్రితులైన మద్యం వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఫక్తు వ్యాపారవేత్తలు, ఐటీ, ఈడీ కేసులలో ఉన్నవారితో టీటీడీ పాలకమండలిని ప్రతిసారి నింపేస్తున్నారు.
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు, ముఖ్యంగా రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు పాలకమండలిలో చోటు కల్పించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మేనకోడలు డా. నిచితా ముత్తవరపు, లిక్కర్ వ్యాపారి నాదెండ్ల సుబ్బారావు, జగన్ కేసులలో సహ ముద్దాయిగా వున్న ఇండియన్ సిమెంట్స్ ఎండీ శ్రీనివాసన్, హెటిరో పార్థసారథి, కావేరి సీడ్స్ భాస్కర్‌రావు, తెలంగాణ రాష్ట్రంలో అనేక ఆరోపణలు వున్న వివాదాస్పద వ్యక్తి మైహోమ్ రామేశ్వరరావు, వైసీపీ పార్టీ పేరును జగన్‌కు దానం చేసిన శివకుమార్‌లకు టీటీడీ పాలకమండలిలో స్థానం కల్పించారు. ఇందులో శివకుమార్ అనే వ్యక్తి వైసీపీ తనదేనని గత ఎన్నికల్లో చేసిన గొడవకు ప్రతిఫలంగా ఇప్పుడు బోర్డ్ మెంబర్‌ని చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
మద్యం వ్యాపారి నాదెళ్ళ సుబ్బారావుకు బోర్డులో స్థానం ఇవ్వటం పట్ల భక్తులు నిరసన వ్యక్తపరుస్తున్నారు. లిక్కర్ వ్యాపారిని ఎలా పవిత్రమైన స్థానంలో కూర్చోపెడతారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు కోటా నుంచి సీటు దక్కించుకున్న ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ పలు కేసుల్లో జగన్‌తో పాటు విచారణ ఎదుర్కొంటున్నారు. తెలంగాణా నుంచి టీటీడీ బోర్డులో నియమితులైన వారిలో బడా వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు. పుట్టా ప్రతాప్‌రెడ్డి, హెట్రో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథరెడ్డి, కావేరీ సీడ్స్ అధినేత భాస్కరరావు, మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు జగన్‌కు అత్యంత సన్నిహితులు. మురంశెట్టి రాములు కేసిఆర్ ఆంతరంగిక వ్యక్తి. సీయంలకు సన్నిహితులనే కానీ, అంత కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టడానికి అవసరమైన మంచి అర్హతలు ఏ ఒక్కటైనా వున్నాయా అంటున్నారు. ముఖ్యంగా మైహోమ్ రామేశ్వరరావు ఇటీవల యాదాద్రి బూతు బొమ్మల వివాదంలో ఈయన పేరు వినబడింది. చినజీయర్ స్వామికి అత్యంత ప్రియభక్తుడు. యాదాద్రిలో కేసీఆర్ బొమ్మలతో పాటు బూతు బొమ్మలను కూడా ఆలయ శిల్పాలలో అమర్చాలన్న మహత్తరమైన ఐడియాలు చినజీయరే ఇచ్చారని అధికారులే చెప్పారు. అలాంటి వ్యక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక బాధ్యతలు అప్పగిస్తే… ఇక్కడ కూడా బూతు బొమ్మల ఐడియాలు ఇవ్వరని ఏముందని జనం తిట్టిపోస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రాశస్థ్యం వుంది. ప్రపంచంలో మేటి పుణ్యక్షేత్రంగా పేరు ప్రతిష్టలు వున్నాయి. అటువంటి టీటీడీకి పాలకమండలి సభ్యులుగా వుండాలంటే ఆధ్యాాత్మిక చింతన, ధర్మ వర్తన, సామాజిక సేవా తత్పరత వంటి ఉత్తమ లక్షణాలు వుండాలి. ఎన్టీఆర్ సమయంలో టీటీడీ పాలక మండలి ఎంపికలో ఎన్నో ప్రామాణీకాలు పాటించేవారు. రానురాను అది రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారిపోతూ వస్తోంది. విద్యావంతులకు, పార్టీలో క్రమశిక్షణ గల సీనియర్లకు, ఆధ్యాత్మిక రంగానికీ చెందిన ప్రముఖులకు చంద్రబాబు మొదట్లో ఆవకాశం కల్పించేవారు. కొంతకాలంగా టీటీడీతో సంబంధం లేని వ్యకులకు టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారు. రెండు తెలుగు రాష్టాలుగా విడిపోయిన తరువాత 16 మంది సభ్యులతో గత తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ బోర్డును ప్రకటించింది. అందులో ఇద్దరు తెలంగాణాకు చెందినవారు వున్నారు. ఒకరు కర్నాటక, మరొకరు తమిళనాడుకు చెందినవారు వున్నారు.
జగన్ ప్రభుత్వం ఏకంగా 25 మందిని సభ్యులుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికీ, తెలంగాణ నుంచి ఏడుగురికీ, తమిళనాడు నుంచి నలుగురికీ, కర్ణాటక నుంచి ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో దాదాపు సమానంగా తెలంగాణాకు అవకాశాలు ఇవ్వడం పట్ల ఏపీకి చెందిన భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణకు టీటీడీతో సంబంధం ఏమిటని నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలుగా వున్న బాసర, భద్రాచలం, యాదాద్రి దేవస్థానాల్లో ఏపీ వారికి ఎవరికైనా అవకాశాలు కల్పించారా అని అడుగుతున్నారు. అలాంటప్పుడు పొరుగు రాష్ట్రం వారికి అంత పెద్దఎత్తున పాలకమండలిలో తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఏపీకి సంబంధించిన ఆస్తులను వదులుకున్న పరిస్థితులలో సీఎం జగన్ టీటీడీ అధికారాలను కూడా వారికి కట్టబెట్టడంలో అర్ధం లేదని ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినవేవీ రాకుండానే హైదరబాద్‌లో వున్న సచివాలయం, శాసనసభ భవంతి వంటి ఆస్తులను తెలంగాణపరం చేసేసిన జగన్.. పొరుగు సీఎం కేసీఆర్ చేతిలో కీలుబోమ్మలా మారిపోయారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఆలాగే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా అంత పెద్ద సంఖ్యలో సభ్యులను తీసుకోవడం అవివేకమని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో వేరే రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారవేత్తలకు, రాజకీయ నేతలకు, ఆరోపణలు వున్న కాంట్రాక్టర్లకు స్థానం కల్పించడం అంటే తిరుమల ప్రతిష్టను దిగజార్చడమేనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ పదవులను కుడా చాక్లెట్లు పంచినట్టు పంచి పెట్టారని దుయ్యబడుతున్నారు. ఇక, పాలకమండలిలో సభ్యులుగా అవకాశం వస్తుందని ఆశించిన కొందరు ఎవరో తెలియని వారికి, అది కూడా రాష్ట్రానికి సంబంధం లేని వారికి పదవులు కట్టబెట్టారని తెలిసి సొంత పార్టీలోనే అసంతృప్తి రగులుతోంది.