“చరిత్ర ఎవరి సొంతం? కొందరిదేనా? అందరిదా? ఇది మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రశ్న. సహజంగా వందేళ్లు దాటితే ఎవరి కథైనా చరిత్ర అవుతుంది. దాన్ని సినిమాగా మలచుకునే హక్కు అందరికీ ఉంటుంది. ఇది సహజ న్యాయం. అదే వాదం ఇప్పుడు రామ్ చరణ్ గుర్తు చేస్తున్నాడు.”
‘సైరా’ విడుదల తేదీ అక్టోబరు 2 దగ్గరయ్యే కొద్దీ వివాదాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ‘సైరా’ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు తొలుత వివాదాన్ని రేపారు. అది అలానే కోర్టులో ఉంది. ఈ విషయంపై రామ్‌చరణ్ ఇప్పటి దాకా నోరు విప్పలేదు. ఇప్పుడు వివాదంపై చరణ్ కొత్త వాదం తెచ్చాడు. వందేళ్లు దాటితే ఎవరి కథైనా చరిత్ర అవుతుందని, దాన్ని సినిమాగా మలచుకునే హక్కు అందరికీ ఉంటుందని చరణ్ గుర్తు చేస్తున్నాడు. ఈ విషయంలో కోర్టు తీర్పుని చరణ్ ప్రస్తావించాడు. మంగళపాండే కథని సినిమాగా తీస్తున్నప్పుడు ఇలాంటి వివాదాలే వచ్చాయని, అవేం నిలబడలేదని చరణ్ చెబుతున్నాడు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం పోరాడారని, అలాంటి వ్యక్తిని ఓ గ్రామానికో, కుటుంబానికో పరిమితం చేయడం ఇష్టం లేదని చరణ్ స్పష్టం చేస్తున్నాడు. సైరా యూనిట్ తరపున ఏమైనా చేయాల్సివస్తే ఆ గ్రామానికి సహాయం చేస్తామని చరణ్ ప్రకటించాడు. వందల కోట్లు ఉంటే ఇలాంటి సినిమాలు రావని, చరిత్రపై గౌరవం ఉన్నప్పుడే `సైరా`లాంటి చిత్రాలు రూపుదిద్దుకుంటాయని చరణ్ చెప్పాడు. దీంతో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వంశస్థులకు `సైరా` బృందం చేసేదేమీ లేదని స్పష్టమైపోయింది. మరి ఇప్పుడు వారు ఏమి చేస్తారు? అనేది ఒక ప్రశ్న?