దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో నలుగురిలో యూకే స్ట్రెయిన్ వైరస్ బయటపడింది. దీంతో మొత్తం కొత్త రకం కేసులు 29కి పెరిగాయి. ఇందులో మూడు బెంగళూరులో కాగా.. ఒకటి హైదరాబాద్‌లో బయటపడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా వైరస్ కంట్రోల్లోకి వస్తోందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. కొత్త రకం కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలగిస్తోంది.
కొత్త రకం కరోనా వైరస్ తొలి కేసు దేశంలో వెలుగుచూసిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యూకే నుంచి విమానాల రాకపోకలను నిలిపివేసింది. అలాగే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య యూకే నుంచి వచ్చిన 33వేల మందిని గుర్తించి.. వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి ఇవాళ్టి వరకు మొత్తం 29 మందితో కొత్త రకం వైరస్‌ను గుర్తించారు.మరోవైపు వీరితో కాంటాక్ట్ అయినవారిని కూడా గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.