దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఫోర్త్ వేవ్ భయాలు కనిపిస్తున్నాయి. కొత్తగా 18,930 మంది వైరస్ బారినపడ్డారు. 35 మంది చనిపోయారు. రోజువారీ కేసుల సంఖ్య ఇంతకుముందు రోజుతో పోలిస్తే 2,500కు పైగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,457గా ఉంది.
ఓవైపు కేసులు పెరుగుతుండగా.. ఇంకోవైపు కొత్త వేరియంట్ వెలుగుచూడడం భయాందోళనకు గురిచేస్తోంది. మహమ్మారి రూపాంతరం చెందుతూ మరింత ప్రమాదకర వేరియంట్లుగా బయటపడుతోంది. తాజాగా అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కు చెందిన కొత్త సబ్ వేరియంట్ బీఏ.2.75ను భారత్ లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఈ కొత్త వేరియంట్ పై దృష్టి పెట్టింది డబ్ల్యూహెచ్‌వో. దీన్ని భారత్ లోనే కాదు.. మరో 10 దేశాల్లో గుర్తించారు. దీనిపై విశ్లేషించడానికి పరిమిత సీక్వెన్సులే అందుబాటులో ఉన్నాయి. ఈ ఉప వేరియంట్ అదనపు రోగనిరోధక ఎగవేత లక్షణాలను కలిగి ఉందా లేదా వైద్యపరంగా మరింత తీవ్రంగా ఉండే లక్షణాలను కలిగి ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అయితే.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు.
మరోవైపు ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాల్లో దాదాపు 30 శాతం కేసులు పెరిగాయి. కొత్తగా 9,52,758 మంది వైరస్ బారినపడ్డారు. యూరప్ దేశాలతో పాటు అమెరికాలో బీఏ.4, బీఏ.5 వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతోంది. భారత్ సహా మరికొన్ని దేశాల్లో సబ్ వేరియంట్ బీఏ.2.75 ను గుర్తించారు.