కరోనా మహమ్మారి కారణంగా విద్యార్ధులపై భారం పడుతోంది. ఏటేటా తరగతులు పెరుగుతున్నాయి. కానీ.. వారి పరిజ్ఙానం మాత్రం పెరగడంలేదంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు. కరోనా కారణంతో విద్యాసంస్థలు ప్రారంభించకపోవడంతో పిల్లలు తమ భవిష్యత్తును కోల్పోతున్నారని వాపోతున్నారు. ఇటీవల కాస్త కరోనా ఉదృతి తగ్గడంతో విద్యార్ధులను విద్యాసంస్థలకు పంపతున్నామంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది ఏపీ విద్యాశాఖ. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయంటున్నారు అధికారులు.
ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను ప్రకటించారు. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తికానున్నాయి.
జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్న నేపథ్యంలో.. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినట్టు విద్యామండలి పేర్కొంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.