సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య స్థల వివాదం ముగిసినప్పటికీ సంఘ్ పరివార్ మధ్య ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. అయోధ్యలోని భూమిని ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పులో కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ప్రస్తుతం అయోధ్యలో రామజన్మభూమి న్యాస్ ఆధీనంలో ఉన్న 11 ఆస్తులను కొత్తగా ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. రామజన్మ న్యాస్ ఆధీనంలో ఉన్న రూ.40 కోట్ల ఆస్తులను కొత్త ట్రస్ట్ కు అప్పగించాలని కోరుతుంది. అయితే రామజన్మభూమి న్యాస్ మాత్రం ఆ డిమాండ్ ను తిరస్కరిస్తుంది. ఆలయ నిర్మాణ పనులను ప్రస్తుతం తామే చూస్తున్నందున కొత్తగా ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రామజన్మభూమి న్యాస్ అధికారిక అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ అంటున్నారు. వి.హెచ్.పి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని చెప్పారు.
అంతేకాదు…మసీదు నిర్మాణం కోసం కేటాయించే ఐదెకరాల భూమి అయోధ్య కల్చరల్ లిమిట్స్ అవతల ఉండాలని విశ్వహిందూ పరిషత్ కోరుతుంది. మసీదు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని…అయితే అయోధ్య కల్చరల్ లిమిట్ 130 కిలో మీటర్ల అవతల మాత్రమే నిర్మించాలని అంటోంది. బీజేపీ నేత వినయ్ కతియార్ మాత్రం రామజన్మన్యాస్ లో కొత్త వారిని చేర్చి ట్రస్ట్ కు కొత్త లుక్ ను తీసుకురావాలని బీజేపీ కోరుతున్నారు.