కరోనా మహమ్మారి వల్ల విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చాలా సమస్యలు మొదలయ్యాయి. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోకపోగా, మరికొంతమంది వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పడ్డారు. విదేశాలకు వెళ్లాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ టీకాలు వేయించుకోవటం తప్పనిసరి. అలాగే ఆ సర్టిఫికెట్ ను కూడా చూపించాల్సి ఉంటుంది. అయితే తాజాగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కోవిన్ యాప్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ మేరకు సరికొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువస్తూ వారి విదేశీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది.విషయంలోకి వస్తే… విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిన్ యాప్ లో సర్టిఫికెట్ ను పొందుతారన్న విషయం తెలిసిందే. అయితే తాజా సర్వీస్ ప్రకారం ఆ సర్టిఫికెట్ లో పుట్టిన తేదీని కూడా యాడ్ చేయబోతున్నారు. ఈ ఫీచర్ వచ్చే వారం నుండి కోవిన్ యాప్ లో ప్రారంభం కానుంది.
కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో ఇంటి పేరుతో సహా పేరు, పుట్టిన తేదీ, దేశం లేదా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతం, వ్యాక్సిన్ జారీ చేసిన ప్రాంతం గురించి వివరాలు అన్ని ఉండాలి. లేదంటే విదేశీ ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది. కోవిన్ ప్రస్తుతం జారీ చేస్తున్న సర్టిఫికెట్ లో లబ్దిదారుని పేరు, వయసు, లింగం, ప్రత్యేక ఆరోగ్య ఐడి, ఐడి, వ్యాక్సిన్ పేరు, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, వ్యాక్సిన్ వేయించుకున్న తేదీ, ఇమ్యునైజేషన్ పేరు, వ్యాక్సిన్ కేంద్రం, పుట్టిన సంవత్సరం, రాష్ట్రం వంటి వివరాలను చూపిస్తుంది.