ప్రైవేట్ టీవీ ఛానళ్ళకు కేంద్రం కొత్తగా మార్గదర్శకాలను సూచించింది. ప్రతి నెల 7 వ తేదీలోగా నెలవారీ రిపోర్టును బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్ కి సమర్పించాలని, జాతీయ భావాలున్న కార్యక్రమాల ప్రసారాలకు ప్రాధాన్యమివ్వాలని కోరింది. నెలవారీ నివేదికల్లో క్రీడలు, భక్తిరస కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, యోగా వంటి కంటెంట్ తో కూడిన వాటికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ నుంచి స్పోర్ట్స్ ఛానల్స్ ని మినహాయించారు.
బ్రాడ్ కాస్టర్లు, వారి సంస్థలతో అనేక దఫాలుగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. గత ఏడాది నవంబరు లోనే ఈ గైడ్ లైన్స్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
90 రోజుల టెలికాస్ట్ కంటెంట్ ఉండేలా చూడాలని ప్రభుత్వం కోరింది. ఇన్ని రోజుల రికార్డుపై ఎలెక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ వాచ్ చేస్తుందని పేర్కొంది. విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, హెల్త్, టెక్నాలజీ, మహిళలు, బడుగువర్గాల సంక్షేమం, జాతీయ సమగ్రత వంటి కార్యక్రమాల ప్రసారానికి ప్రాధాన్యమివ్వాలని సూచించింది.
ఇవి తప్పనిసరిగా 30 నిముషాలపాటు ఉండాలన్న నిబంధన లేకున్నా చిన్న చిన్న స్లాట్ లుగా విభజించుకోవచ్చునని అభిప్రాయపడింది. నిజానికి ఇలాంటి గైడ్ లైన్స్ ని రేడియో ఛానల్స్ కి కూడా గత ఏడాది జులై లోనే విడుదల చేశారు. మొత్తానికి జాతీయతకు ప్రాధాన్యమివ్వాలని ఈ మార్గదర్శకాల్లో మరీ మరీ కోరారు.